Tomatoes Cause Kidney Stones: టమాటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారు..?

నిపుణులు ఏమంటున్నారు..?

Update: 2025-12-08 15:12 GMT

Tomatoes Cause Kidney Stones:  కిడ్నీలో రాళ్లు అనేది చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ నేపథ్యంలో, ఈ సమస్యకు సంబంధించి మనం అనేక ఊహాగానాలు, చిట్కాలు వింటుంటాము. వాటిలో ఒకటి టమాటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయి అనే అపోహ. అయితే ఈ వాదనలో నిజమెంత..? టమోటాలు తినకూడదని ఎందుకు అంటారు? వివరాలు తెలుసుకుందాం.

టమాటాలు, ఆక్సలేట్: అపోహ నిజమేనా?

సాధారణంగా టమాటాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల లేదా ఆహారంలో విరివిగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని చాలామంది బలంగా నమ్ముతారు. దీనికి ప్రధాన కారణం టమోటాలలో ఉండే ఆక్సలేట్ కంటెంట్. అధిక ఆక్సలేట్ మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ రాళ్లకు దారితీస్తుంది.

అయితే ఆరోగ్య నిపుణులు ఈ వాదనలను తోసిపుచ్చుతున్నారు. టమాటాలలో ఆక్సలేట్ ఉంటుంది. కానీ దాని పరిమాణం చాలా తక్కువ. 100 గ్రాముల టమాటాలలో కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ పరిమాణంలో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఏ మాత్రం సరిపోదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి టమాటాలను పరిమితంగా తీసుకోవడం వల్ల రాళ్లు వచ్చే ప్రమాదం ఉండదని తెలుస్తోంది.

కిడ్నీలో రాళ్లకు అసలు కారణాలు ఇవే!

టమోటాలు కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక ఇతర ముఖ్య కారణాలు ఉన్నాయి. వీటిపై శ్రద్ధ పెట్టడం అత్యవసరం:

డీహైడ్రేషన్ : మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అతి ముఖ్యమైన కారణం డీహైడ్రేషన్. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

జీవక్రియ సమస్యలు : కొన్ని ఎంజైమ్‌ల లోపం, జీవక్రియ సమస్యల కారణంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

ఆక్సలోసిస్: ఇది ఒక అరుదైన జీవక్రియ రుగ్మత. ఈ సమస్య ఉన్నవారిలో, మూత్రపిండాలు శరీరం నుండి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా విసర్జించడం ఆపివేస్తాయి, దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

కాల్షియం ఆక్సలేట్‌తో పాటు యూరిక్ యాసిడ్ రాళ్ళు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్ళు వంటి ఇతర రకాల స్ఫటికాలు కూడా రాళ్లను ఏర్పరుస్తాయి.

టమాటాలు కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణం కాదని, నీరు తక్కువగా తాగడం, జీవక్రియ సమస్యలు వంటివే ముఖ్య కారణాలని ప్రజలు గుర్తించడం చాలా అవసరం.

Tags:    

Similar News