Stop Throwing Away Rice Water: ఇకపై బియ్యం నీటిని పారేయకండి: దాని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు!
ఇకపై బియ్యం నీటిని పారేయకండి: దాని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు!;
Stop Throwing Away Rice Water: బియ్యం నానబెట్టిన లేదా ఉడికించిన నీటిని చాలామంది పారేస్తుంటారు. కానీ, దాని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొరియన్ చర్మ సంరక్షణలో బాగా ప్రాచుర్యం పొందిన బియ్యం నీరు (గంజి) ముఖంపై మచ్చలను తగ్గించడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
బియ్యం నీటిలోని పోషకాలు:
బియ్యం నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ నీటిని ప్రతిరోజూ తాగవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బియ్యం నీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది: వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. బియ్యం నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బియ్యం నీటిలో ఉండే స్టార్చ్ జీర్ణక్రియకు చాలా మంచిది. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు కొద్దిగా ఉప్పు కలిపి ఈ నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
శరీర వేడిని తగ్గిస్తుంది: బియ్యం నీరు శరీర వేడిని తగ్గిస్తుంది. కాళ్లు, చేతుల్లో మంటగా ఉండే వారికి ఇది మంచి పరిష్కారం. ముఖ్యంగా మధుమేహం లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల శరీర వేడి పెరిగే మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: బియ్యం నీరు క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. ఇది మూత్ర విసర్జన సమయంలో కలిగే నొప్పిని కూడా తగ్గిస్తుంది.
నెలసరి నొప్పి నుంచి ఉపశమనం: చాలామంది మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. బియ్యం నీరు ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
ఇకపై బియ్యం నీటిని పారేయకుండా, దానిని మీ దినచర్యలో భాగంగా చేసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.