Stroke Alarm in Young Brains: యువత మెదడులో స్ట్రోక్ అలజడి.. మీ అలవాట్లే మీకు శత్రువులా?

మీ అలవాట్లే మీకు శత్రువులా?

Update: 2026-01-08 08:51 GMT

Stroke Alarm in Young Brains: దేశంలో యువత ప్రాణాలు ఇప్పుడు మెదడు నరాల్లో చిక్కుకుపోతున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్, ఇప్పుడు 35 ఏళ్ల లోపు యువతపై పంజా విసురుతోంది. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. దేశంలో ఏటా 18 లక్షల మంది స్ట్రోక్ బారిన పడుతుండగా, అందులో 25 శాతం మంది యువతే ఉండటం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య కేవలం 3 నుండి 5 శాతమే ఉండటం, భారత్‌లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఎందుకీ మరణ మృదంగం?

కరోనా మహమ్మారి తర్వాత యువతలో ఒత్తిడి విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు..

జీవనశైలి: పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు, నిద్రలేమి.

వ్యసనాలు: ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వాడకం.

ఆరోగ్య సమస్యలు: అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం.

ప్రస్తుతం దేశంలో ప్రతి 400 మందిలో ఒకరు స్ట్రోక్ బారిన పడుతున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ఈ మహమ్మారి వల్ల మరణిస్తున్నారనే చేదు నిజాన్ని నిపుణులు వెల్లడించారు.

గుర్తించడం ఎలా?

స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అత్యంత ముఖ్యం. ఈ లోపు చికిత్స అందితే ప్రాణాపాయం తప్పుతుంది.

ముఖం లేదా అవయవాలు ఒకవైపు ఆకస్మికంగా తిమ్మిరి రావడం లేదా వాలిపోవడం.

మాట తడబడటం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది.

తీవ్రమైన తలనొప్పి, కళ్లు మసకబారడం, సమతుల్యత కోల్పోవడం.

స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి చిట్కాలు

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో రోగికి అందించే సంరక్షణ చాలా కీలకం

భంగిమ మార్పు: పడకపై ఉన్న రోగిని ప్రతి రెండు గంటలకు ఒకసారి అటు ఇటు తిప్పాలి.

బాల్ పంచింగ్: చేతిలోని నరాలు ఉత్తేజితం కావడానికి చిన్న బంతిని నొక్కే వ్యాయామం చేయించాలి.

సిట్-టు-స్టాండ్: మంచంపై నుండి లేచి నిలబడే ప్రయత్నాన్ని ప్రతిరోజూ చేయించడం ద్వారా కాళ్లపై పట్టు వస్తుంది.

ఒత్తిడి లేని వాతావరణం: రోగికి బలమైన సంకల్ప శక్తిని నూరిపోయాలి, తగినంత నిద్ర మరియు పౌష్టికాహారం అందించాలి.

స్ట్రోక్ అనేది ప్రాణాంతకమే కావచ్చు, కానీ సరైన జీవనశైలి, సమయానికి స్పందించడం ద్వారా దానిని జయించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి!

Tags:    

Similar News