Strengthen Your Immunity: ఉదయం నిద్ర లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగడానికి అలవాటు పడుతుంటారు. అయితే వీటికి బదులుగా.. పరగడుపున కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిగా.. ఉసిరి. ఇందులో విటమిన్‌-సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపునే తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది.

రెండవది.. తేనె. ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరంలోని హానికారక సూక్ష్మజీవులతో పోరాడటానికి శక్తినిస్తాయి. అంతేకాదు, ఇది అధిక బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

మూడవది.. తులసి. రోజూ తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులతో పాటు ఆ నీటిని తాగితే.. దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఇది చర్మానికి, జుట్టుకి కూడా ఎంతో మేలు చేస్తుంది.

నాల్గవది.. వెల్లుల్లి. సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పేరున్న వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు మెండుగా ఉంటాయి. పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Tags: