Watching Your Phone While Eating: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే చాలామంది భోజనం లేదా టిఫిన్ చేసే సమయంలో కూడా రీల్స్, వీడియోలు లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ తింటుంటారు. సాధారణంగా కనిపించే ఈ అలవాటు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం చేసే సమయంలో మొబైల్ వాడటం వల్ల కలిగే నష్టాలు..

జీర్ణక్రియ దెబ్బతింటుంది:

ఫోన్‌లో లీనమై తినడం వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలడం మర్చిపోతారు. సరిగ్గా నమలకుండా మింగడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే స్క్రీన్ చూస్తూ వేగంగా తినడం వల్ల ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు. దీనివల్ల అతిగా తినడం, ఫలితంగా బరువు వేగంగా పెరగడం జరుగుతుంది.

కంటి సమస్యలు:

రోజంతా డిజిటల్ స్క్రీన్లు చూసే కళ్లకు భోజనం చేసే సమయమైనా విశ్రాంతి ఇవ్వాలి. కానీ తినే సమయంలోనూ ఫోన్ వైపే చూస్తుంటే కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది కళ్ల మంటలు, అలసట, నీరు కారడం, దృష్టి మందగించడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఆహార తృప్తి లభించదు:

ఆహారం తీసుకోవడం అంటే కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు; దాని రుచి, సువాసనను ఆస్వాదించడం కూడా ముఖ్యం. ఫోన్‌లో మునిగిపోవడం వల్ల ఆహార రుచిపై దృష్టి ఉండదు, ఫలితంగా భోజనం చేసిన పూర్తి మానసిక సంతృప్తి దక్కదు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం:

భోజనం వేళల్లో ఫోన్ కాల్స్, ఆందోళన కలిగించే వార్తలు లేదా సోషల్ మీడియా పోస్టులు చూడటం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

కుటుంబ బంధాలు దూరం:

భోజన సమయం అనేది కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి మంచి అవకాశం. చేతిలో ఫోన్ ఉంటే చుట్టూ ఉన్నవారితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఇది కాలక్రమేణా సంబంధాలను బలహీనపరిచి, ఒంటరితనాన్ని పెంచుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లు:

భోజనం చేసే సమయంలో మొబైల్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టండి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి, మనసు పెట్టి తినడమే ఆరోగ్యానికి అసలైన అమృతం.

Tags: