Winter Skin Cracking: చలికాలం వచ్చిందంటే చాలా మందికి మొదటి ఇబ్బంది చర్మం పొడిబారడమే. చర్మం డ్రైగా మారి దురదలు, మంటలు, పగుళ్లు వంటి సమస్యలు వేధిస్తాయి. పెదవులు పగలడం, మడమల్లో పగుళ్లు, మోకాళ్లు మోచేతుల్లో చర్మం నల్లగా మారడం సర్వసాధారణం. చాలామంది ఖరీదైన క్రీములు వాడుతుంటారు. కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. శాశ్వత పరిష్కారం కావాలంటే స్నానం చేసే పద్ధతి నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టాలి.

శరీరానికి నూనె మసాజ్ చాలా అవసరం. సమయం దొరికినప్పుడల్లా నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఆవనూనెను కాస్త వేడి చేసి గోరువెచ్చగా చేసి శరీరం మీద మసాజ్ చేయాలి. స్నానానికి ముందు ఇలా మసాజ్ చేస్తే స్నానం చేసే నీళ్లు చర్మంలోకి చేరిన నూనెను బయటకు పోనీయకుండా లాక్ చేస్తాయి. దాంతో చర్మం తేమగా ఉంటుంది. పొడిబారకుండా కాపాడుతుంది.

చలికాలంలో రోజువారీ సబ్బులే చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి. ఎందుకంటే వాటిలో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో గ్లిజరిన్ ఉన్న సబ్బులు వాడాలి. అంతకంటే మంచిది సబ్బుకు బదులు సున్నిపిండి, శెనగపిండి, పసుపు, పాలు, నిమ్మరసం కలిపి శరీరం మీద పట్టించి స్నానం చేయడం. ఇలా చేస్తే డ్రై స్కిన్ సమస్యలు దూరం అవుతాయి.

స్నానం చేసే పావు గంట ముందు బాడీకి ప్యాక్స్ వేయడం మంచిది. పాలు-శెనగపిండి, పాలు-నిమ్మరసం, పాలు-పసుపు వంటి మిశ్రమాలను వాడితే చర్మం తేమగా ఉంటుంది. ఈ ప్యాక్స్ ఆరిన తర్వాత స్నానం చేస్తే ఫలితం బాగుంటుంది.

ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. చలి ఉందని మరీ వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోతుంది. కొన్నిసార్లు పగుళ్లు కూడా వస్తాయి. ఎంత చలిగా అనిపించినా గోరువెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. తలకు హెయిర్ డ్రయర్ వాడినప్పుడు కూడా చర్మం మీద నేరుగా వేడి గాలి పడకుండా జాగ్రత్త పడాలి.

స్నానం చేసిన వెంటనే చర్మం ఇంకా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ లేదా ఆయిల్ రాసుకోవాలి. ఇలా చేస్తే తేమ లోపలే నిలిచిపోతుంది. రోజంతా నీళ్లు బాగా తాగాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. చలికాలంలో కూడా యూవీ కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి.

ఈ సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో చర్మం పగులకుండా, పొడిబారకుండా తేమగా, మృదువుగా, నిగనిగలాడేలా ఉంటుంది. ఖరీదైన ప్రొడక్ట్స్ కంటే ఇంటి పదార్థాలతో చేసే ఈ సంరక్షణే మంచి ఫలితాలు ఇస్తుంది. చలి వాతావరణం చర్మం నుంచి తేమను లాగేస్తుంది కాబట్టి రోజువారీగా ఈ అలవాట్లు పాటించడం చాలా అవసరం. ఇలా చేస్తే శీతాకాలం అంతా చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.

Tags: