Onion Trick: సోషల్ మీడియాలో రకరకాల హెల్త్ టిప్స్ వైరల్ అవుతుంటాయి. అందులోనూ రాత్రి పూట కాళ్ళ అడుగున ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని సాక్స్ వేసుకుంటే, శరీరంలోని మలినాలు, విషపదార్థాలన్నీ బయటకు పోతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఈ ట్రిక్‌లో ఎంతవరకు నిజం ఉంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వైరల్ ట్రిక్ ప్రకారం, పాదాల కింద ఉన్న 'సోల్స్ ద్వారా ఉల్లిపాయ శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని శుద్ధి చేస్తుందని, జలుబు, ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తుందని నమ్ముతారు. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వల్ల దానికి ఔషధ గుణాలు ఉన్న మాట వాస్తవమే. కానీ, కాళ్ళ కింద ఉల్లిపాయ ముక్కలు పెట్టినంత మాత్రాన అవి శరీరంలో ఉన్న ట్యాక్సిన్లను పీల్చుకుంటాయా? అంటే, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

వైద్య నిపుణుల ప్రకారం, మన శరీరం నుండి విషపదార్థాలను (Toxins) బయటకు పంపే ప్రధాన బాధ్యత లివర్ (కాలేయం) కిడ్నీలది. అంతేకాని, చర్మం ద్వారా లేదా పాదాల కింద ఉల్లిపాయ ముక్కలు ఉంచడం ద్వారా బాడీ డిటాక్స్ అవుతుందనడంలో ఎలాంటి వైద్య సత్యం లేదు. రాత్రి పూట కాళ్ళకు ఉల్లిపాయలు పెట్టుకున్నప్పుడు అవి నల్లగా మారడానికి కారణం... ఉల్లిపాయలోని రసాలు గాలికి, చర్మంలోని చెమటకు రియాక్ట్ కావడమే తప్ప, బాడీలోని మలినాలు బయటకు రావడం వల్ల కాదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

అయితే, ఉల్లిపాయ వాసన వల్ల శ్వాసనాళాలు కొద్దిగా క్లియర్ అవ్వడం లేదా ప్లేసిబో ఎఫెక్ట్ వల్ల తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు. కానీ, దీన్ని పూర్తి స్థాయి డిటాక్స్ పద్ధతిగా నమ్మడం పొరపాటే. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సోషల్ మీడియా చిట్కాలపై పూర్తిగా ఆధారపడకుండా, సరైన వైద్యులను సంప్రదించడం ఎప్పుడూ శ్రేయస్కరం.

Tags: