Onions Make You Cry: ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల వెంట నీళ్లు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన రసాయనిక ప్రక్రియ దాగి ఉంది. ఉల్లిపాయలు భూమిలో పెరిగేటప్పుడు నేల నుంచి సల్ఫర్ (గంధకం) అనే మూలకాన్ని గ్రహిస్తాయి. ఉల్లిపాయ పొరల్లోని కణాలలో ఈ సల్ఫర్ కాంపౌండ్లు, అలాగే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు వేర్వేరు భాగాలలో సురక్షితంగా నిల్వ అయి ఉంటాయి.

మనం ఉల్లిపాయను కత్తితో కోసినప్పుడు ఆ పొరల్లోని కణాలు విరిగిపోయి, లోపల ఉన్న ఎంజైమ్‌లు మరియు సల్ఫర్ కాంపౌండ్లు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఈ రసాయనిక చర్య వల్ల 'సిన్-ప్రోపాన్థియాల్-ఎస్-ఆక్సైడ్' అనే తీవ్రమైన అసహనాన్ని కలిగించే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువు గాలిలో తేలుతూ వచ్చి మన కళ్లను తాకుతుంది.

మన కళ్లకు ఆ వాయువు తగలగానే కంటిని రక్షించుకోవడానికి నరాలు మెదడుకు సంకేతాలు పంపుతాయి. దాంతో కళ్లను సదరు రసాయనం నుండి శుభ్రం చేయడానికి కంటిలోని అశ్రు గ్రంథులు వెంటనే స్పందించి నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఉల్లిపాయ ఘాటు నుంచి కళ్లను కాపాడుకోవడానికి శరీరం చేసే ఒక సహజమైన రక్షణ చర్యే ఈ కన్నీళ్లు.

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కోయడానికి ముందు ఉల్లిపాయలను కొద్దిసేపు చల్లటి నీళ్లలో ఉంచడం లేదా ఫ్రిజ్‌లో పెట్టడం, ఉల్లిపాయ కోసేటప్పుడు పక్కన ఒక వెలిగించిన దీపం లేదా కొవ్వొత్తి ఉంచుకోవడం వల్ల ఆ వాయువు తీవ్రత తగ్గి కన్నీళ్లు రాకుండా ఉంటాయి.

Tags: