Ratan Tata : రతన్ టాటా ఆస్తులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు
బాంబే హైకోర్టు కీలక తీర్పు;
Ratan Tata : టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఆస్తులకు సంబంధించి ఆయన సవతి సోదరీమణులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రతన్ టాటాకు చెందిన లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలలో ఉన్న వాటా ఆయన స్థాపించిన రెండు ఫౌండేషన్లకే చెందుతుందని బాంబే హైకోర్టు కీలక తీర్పులో స్పష్టం చేసింది. ఈ వాటా ఆయన సవతి సోదరీమణులకు దక్కదని తేల్చి చెప్పింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దివంగత పారిశ్రామికవేత్త ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఎవరికి దక్కుతుందని టాటా ఆస్తుల నిర్వాహకులు హైకోర్టును అడిగినప్పుడు ఈ స్పష్టత వచ్చింది.
కోర్టు ఇటీవల ఈ విషయమై ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాటా వీలునామా చట్టపరంగా మార్గం సుగమం అయింది. ఈ ప్రక్రియ ఒక నెలలో పూర్తవుతుందని అంచనా. కోర్టు చెప్పిన ప్రకారం.. రతన్ టాటాకు చెందిన లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలలోని వాటా రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేష, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ అనే ఆయన రెండు ఫౌండేషన్లకు ఇవ్వనున్నారు. ఈ వాటాలో ఆయన సవతి సోదరీమణులు షిరీన్, డీనా జెజెభాయ్, అలాగే మోహిని దత్తాకు ఎటువంటి హక్కు ఉండదు. మోహిని దత్తా తనను తాను టాటా దత్తపుత్రుడిగా చెప్పుకుంటారు. రతన్ టాటాకు సన్నిహితుడిగా కూడా ఉన్నారు.
రతన్ టాటా ఆస్తుల నిర్వాహకులు తమ ఈక్విటీ వాటా ఎవరికి ఇవ్వాలి అని తెలుసుకోవడానికి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జూన్ 16, 2025న ఆదేశాలు జారీ చేస్తూ, ఈ ఆస్తిని ఆయన రెండు ఫౌండేషన్ల మధ్య సమానంగా పంచాలని స్పష్టం చేసింది. నిర్వాహకుల మధ్య ఎటువంటి వివాదం లేనప్పటికీ, వారు కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులుగా కూడా ఉన్నారు. అంతేకాకుండా, రతన్ టాటా వీలునామాకు సంబంధించిన అనుబంధాలపై ఇతర వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీలునామాలోని 4 నుండి 8 సెక్షన్లలో లబ్ధిదారులుగా పేర్కొనబడిన ఆయన సవతి సోదరీమణులు, మోహిని దత్తాకు నాన్-టాటా సన్స్ షేర్లు కూడా ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది.
అయితే, వీలునామాలోని 13వ సెక్షన్ ప్రకారం రతన్ టాటా తన ఆస్తికి సంబంధించిన చివరి కోరికను మార్చుకున్నారు. కోర్టు ఈ అనుబంధం వీలునామాపై ప్రభావం చూపుతుందని, సుప్రీంకోర్టు పూర్వ తీర్పులను ఉదహరిస్తూ దీనిని గుర్తించినట్లు స్పష్టం చేసింది.
రతన్ టాటా వద్ద రూ.1,547 కోట్ల కంటే ఎక్కువ విలువైన నాన్-టాటా సన్స్ షేర్లు ఉన్నాయి. వీటిలో TCS, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, RNT అసోసియేట్స్, ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్, క్యూర్‌ఫిట్, అవంతి ఫైనాన్స్, ఎలెక్ట్రా EV , హౌమెట్ ఏరోస్పేస్, అల్కోవా కార్పొరేషన్ వంటి కొన్ని విదేశీ షేర్లు ఉన్నాయి. ఈ షేర్లన్నీ ఇప్పుడు రెండు ఫౌండేషన్లకు సమాన భాగాలుగా పంచుతారు. ఇక టాటా సన్స్ లో రతన్ టాటా వాటా విలువ దాదాపు రూ.1,684 కోట్లుగా అంచనా వేసింది. ఆయన వీలునామాలో వీటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిని RTEF, RTET ఫౌండేషన్ల మధ్య 70:30 నిష్పత్తిలో పంచుతారు.