రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానం... విశ్లేషణ

అసెంబ్లీలో తీర్మానం చేయటంతో శ్రేణుల్లో ఉత్సాహం;

Update: 2025-08-09 09:57 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాక శాసనసభలో తీర్మానం చేసిన ప్రభుత్వం తదనుగుణంగా కార్యచరణ చేపట్టడం లేదని ఆరోపణలు మొదలయ్యాయి.

అసెంబ్లీలో తీర్మానం చేయటంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పార్టీ నాయకత్వం… ఎలా నిలబెట్టుకోవాలో తెలియక కేంద్రంపై నెపం మోపేందుకు కసరత్తు చేస్తోందని అనుమానాలు వస్తున్నాయి.

శాసనసభ తీర్మానం తర్వాత పార్లమెంటు తీర్మానం చేయాల్సి ఉంది. ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉండగా…ఆ వైపు ప్రయత్నాలు జరగటం లేదని విశ్లేషణలు జరుగుతున్నాయి.

రిజర్వేషన్లు తీసుకువచ్చే ముందే కేంద్రానికి ఈ ఆంశం నివేదించి….అసెంబ్లీలో తీర్మానం చేశాక కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వివరించాల్సి ఉండింది. అందుకు విరుద్దంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమస్య జఠిలమవుతోంది.

రిజర్వేషన్ల ఆంశం అధికార, విపక్ష కూటముల మధ్య రాజకీయంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన పరివారంతో ఢిల్లీలో మూడు రోజుల మకాం వేశారు. ఒకరోజు రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని అనుకున్నారు. అది జరగలేదు. మరో రోజు పార్టీ అగ్రనేతలతో సమావేశం… ఆ మరుసటి రోజు రిజర్వేషన్ల డిమాండుతో ధర్నా నిర్వహించారు.

ఇంత చేస్తే ఆ ధర్నాకు అగ్రనేత రాహూల్‌ గాంధీ రాలేదు. రాహూల్‌ దృష్టంతా ఈవిఎంల గోల్‌ మాల్‌ పైనే ఉంది. ఆయన రిజర్వేషన్ల ఆంశంపై అంతగా స్పందించటం లేదు.

దీంతో రాష్ట్ర నాయకత్వం జీవో తీసుకువచ్చి అమలు చేయాలని యోచించారు. అయితే ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికలు ఆగిపోతాయి. కొద్ది రోజులపాటు ఎన్నికలు ఆపాలనే చర్చ కూడా సాగుతోంది.

న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ లో ఎన్నికలు జరగాలి. లేదంటే కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు నిధులు రావు.

వీటన్నింటికి పరిష్కారంగా కాంగ్రెస్‌ నాయకత్వం కొత్త ఆంశం తెరమీదకు తీసుకొచ్చింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని కొత్త రాగం అందుకుంది. దీంతో ఇతర పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు.

నాటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్‌ అంకితభావంపై మీద పార్టీ కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రిజర్వేషన్ల ఆంశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడిందని విశ్లేషణలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో విపక్షాలకు ఇదే ప్రచార అస్త్రంగా మారనుందని అందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News