సెప్టెంబర్ 17 వాస్తవాలు... వక్రీకరణలు

హైదరాబాద్‌ సంస్థానం స్వయం ప్రతిపత్తి కలిగి వున్న రాజ్యం

Update: 2025-09-17 04:03 GMT

హైదరాబాద్‌ రాజ్యం భారత అంతర్భాగంలో చేరడమంటే విలీనమేనా? లేకపోతే విమోచనమా ? అదీ కాకపోతే విద్రోహమా? భారత సైన్యం దురాక్రమణా?

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి హైదరాబాద్‌ సంస్థానం స్వయం ప్రతిపత్తి కలిగి వున్న రాజ్యం... నిజాం రాజుల పాలన కింద వున్న ఆ రాజ్యాన్ని అప్పటి భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపించి భారత భూభాగంలో విలీనం చేసుకున్నారు.. హైదరాబాద్‌ రాజ్యాన్ని కలుపుకోడానికి వంద గంటలు పట్టిందంతే...

ప్రతి ఏడాది మొక్కుబడిగా అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరుగుతూ వస్తోంది...ఇప్పుడది విస్మృతిగా మారింది...వివాదాలను చెలరేపుతోంది... హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో చేరడాన్ని విలీనం అని కొందరు... విమోచనమని మరికొందరు...విద్రోహమని ఇంకొందరు అంటున్నారు...ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒక సూర్యుడు లోకులకు ఒక్కొక్క రీతిగా కనిపించినట్టు హైదరాబాద్‌ విమోచనంపై ఇన్నేసి వైరుద్య భావనలు కనిపించడం వింతే!

అసలేం జరిగింది. పాలకుల మధ్య అధిపత్యాల పోరా..?అధికార బదిలీనా..?ఒక పెద్ద దేశం మరో సంస్థానంపై బలప్రయోగం చేసిందా..? కబ్జాచేసి తనలో విలీనం చేసుకుందా..? లేక నిజాం పాలననుంచి ప్రజలు విమోచన కోరుకుంటే- భారత సైన్యం పోలీస్‌చర్య పేరుతో దాన్ని సాధించిపెట్టిందా..? ఎన్నో ప్రశ్నలు. ఎవరి దృష్టికోణం నుంచి వారు సమాధానాలిస్తున్నారు. విలీనమా.. విమోచన అన్న విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు.

చరిత్రలోకి తొంగిచూస్తే-వాస్తవాలను జల్లెడపడితే- ఎన్నో వాస్తవాలు కళ్ళకు కడతాయి. అయితే వీటికి భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బిజెపి మాత్రమే హైదరాబాద్‌ సంస్థానంపై జరిగిన పోలీస్‌ యాక్షన్‌ని విమోచనదినోత్సవంగా జరుపుతోంది. తెలంగాణ బాలబాలికలు ఇప్పటికీ తమకు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15నే వచ్చిందని చదువుకుంటున్నారు. 1948 సెప్టెంబర్‌ 17 చరిత్రని వారికి ఏ పాఠగ్రంథమూ చెప్పడం లేదు

ఇక విలీనం అన్న మాటకి వస్తే- దీనికి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. తొలుత- భారతప్రభుత్వమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించలేదు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 13 నెలల వరకూ కూడా హైదరాబాద్‌సంస్థానం భారత్‌లో అంతర్భాగంగా లేదు. 1948 సెప్టెంబర్ 17న "ఆపరేషన్‌ పోలో'' పేరుతో పోలీసు చర్యకి దిగి ఈ ప్రాంతాన్ని భారత్‌ యూనియన్‌లో చేర్చారు. పేరుకిది పోలీసు చర్యకానీ, యుద్ధానికి దిగింది మాత్రం భారత సైన్యం. ఆ దాడితో 225 సంవత్సరాల ఆసఫ్‌జాహీల పాలన అంతమైంది. అయితే ఈ చర్యను నిరసిస్తూ అప్పటి నిజాం నవాబు ఉస్మాన్‌అలీ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుకూడా చేశారు. ఎన్నడూ ఢిల్లీ పాలనలో లేని తమ సంస్థానంపై భారత్‌ సైనిక జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్దమని ఆయన వాదించారు. దీనిపై భారత ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ- "హైదరాబాద్‌ సంస్థాన ప్రజల హక్కులు అణచివేస్తుంటే జోక్యం అనివార్యమైందని, తాము చేసింది పోలీసు చర్యే కానీ, సైనిక చర్య కాదని'' సమర్థించుకుంది. అంటే- హైదరాబాద్‌ సంస్థాన అస్తిత్వాన్ని స్వయంగా భారత ప్రభుత్వమే అంతర్జాతీయ వేదికల మీద ఒప్పుకున్నట్టయ్యింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం వుంది. పోలీస్‌యాక్షన్‌కి అయిన ఖర్చ 200 కోట్లు. ఈ ఖర్చుని ఏ శాఖ పద్దుకింద చూపించాలన్న విషయంలో అప్పట్లో పార్లమెంటులో చర్చజరిగింది. పేరుకిది పోలీస్‌ యాక్షనే అయినా- దాడిలో పాల్గొన్నది సైనికులు కనుక ఈ ఖర్చును తమ పద్దులో చూపడానికి హోంమంత్రిత్వశాఖ ఒప్పుకోలేదు. ఈ తలనొప్పంతా ఎందుకని రక్షణశాఖ కూడా ఆ ఖర్చుని మీదేసుకోడానికి అంగీకరించలేదు. చివరికి ఈ ఖర్చుని వైద్య ఆరోగ్యశాఖ పద్దులో చూపారు. ఇప్పటికీ అధికారిక పత్రాల్లో ఇదే నమోదైవుంది. హైదరాబాద్‌ సంస్థాన విలీనంలో ఇన్ని లొసుగులు, వివాదాలు వున్నందువల్లే కేంద్రస్థాయిలో స్పష్టమైన విధాన ప్రకటన కనిపించదు. అంతేకాదు- భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు, హైదరాబాద్‌ సంస్థానంలో నమోదైన కేసులను భారతయూనియన్‌కి సంబంధించిన కేసులుగా పరిగణించడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించ లేదు. తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు జనార్ధనరెడ్డితోపాటు మరో 12మందికి 1949 డిసెంబర్‌లో హైదరాబాద్‌ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసానం తిరస్కరించింది. హైదరాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువడినప్పుడు ఆ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం కాదుకనుక- పిటిషన్‌ స్వీకరించరాదని నిర్ణయించింది.

ఒక రాజ్యప్రజలు, రాజ్యాధినేత, ప్రభుత్వ వ్యవస్థ తమ రాజ్యాన్ని వేరే దేశంలో స్వచ్ఛందంగా కలిపివేయడానికి అంగీకరిస్తేనే అది విలీనం కింద లెక్క. ఒకవేళ అదే బలప్రయోగమైతే- విద్రోహమనే అనాలి. నాడు హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం వ్యతిరేక పోరాటం బలంగా జరుగుతుండవచ్చు కానీ- మెజారిటీ ప్రజలుకానీ, సంస్థానాధీశుడు కానీ, అధికార యంత్రాంగాం కానీ తమను విలీనం చేసుకోమని అభ్యర్థించినట్టు ఎక్కడా కనిపించదు.

సెప్టెంబర్‌ 17న జరిగింది హైదరాబాద్‌ సంస్థాన విలీనమూ కాదు, విమోచనా కాదు. ఇది విద్రోహమని వాదించేవారు అనేక అంశాలు ఉదహరిస్తున్నారు. నాడు జరిగింది- హైదరాబాద్‌ సంస్థానంలో బలపడుతున్న కమ్యూనిస్టు ఉద్యమంపై సైనిక దాడి తప్ప మరొకటి కాదంటున్నారు. ఈ సంస్థానమే కనుక- కమ్యూనిస్టు రాజ్యంగా మారితే భారత్‌ పక్కలో బల్లెంగా మారే ప్రమాదముందని భావించిన నెహ్రూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా సైనిక దాడికి దిగిందన్నది వారి వాదనల సారాంశం.

వాయిస్‌ ఫైవ్‌

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతమైనది. కోటి రతనాల వీణ తెలంగాణ వీరోచిత పోరాటాలకి పేరెన్నికగన్నది. రైతాంగ సాయుధ సమరంతో వేడెక్కిపోయింది. ఇటు మావో అటు మహాత్మాగాంధీల చూపును కూడా తనవైపు తిప్పుకున్న ఘనమైన ఉద్యమం వీర తెలంగాణ సాయుథ సమరం. నిజాం నిరంకుశ ధోరణికి, దొరలు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరులో సుమారు పది లక్ష ఎకరాల భూమి ప్రజాపరమైంది. మహిళలు కూడా ఆయుధాలు చేపట్టి పోరుబాట పట్టారు.

ఒకవేళ భవిష్యత్తులో ఈ సంస్థానంలో కమ్యూనిస్టులదే పైచేయి అయితే పరిస్థితి ఏంటి..? ఇలాంటి ఆలోచనతోనే సాయుధ పోరుని మిలటరీ దాడితో అణచివేసింది నెహ్రూ ప్రభుత్వం. అందుకే నాటి భారత సైనిక బలగాలు భూస్వాములకు రక్షణ కల్పిస్తూ కమ్యూనిస్టులను ఊచకోత కోశాయన్న ఆరోపణలున్నాయి. వీరి దాడిలో చనిపోయింది హిందువయితే కమ్యూనిస్టని, చనిపోయింది ముస్లిమయితే రజాకార్‌ అని ముద్రవేశారనీ అంటున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే-1946 జులై 3 నుంచి 1948 సెప్టెంబర్‌ 17 వరకూ నిజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కంటే 1948 సెప్టెంబర్‌ 18 నుంచి 1951 అక్టోబర్‌ వరకూ భారత సైనిక బలగాలు చేసిన హత్యలే అధికం! అంతేకాదు- కమ్యూనిస్టు ఉద్యమకాలంలో ప్రజలపరమైన పదిలక్షల ఎకరాలను కూడా భారత యూనియన్‌ బలగాలు బలవంతంగా స్వాధీనం చేసుకుని తిరిగి పూర్వపు యజమానులకే ధారదత్తం చేశాయి. అలా తిరిగి లాభపడ్డ పటేల్‌ పట్వారీ జాగీర్దర్లే తెలంగాణలో కొత్త రూపాల్లో పాలకుల అవతారమెత్తారు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే- తెలంగాణ సాయుధ సమరం వల్ల సాధించుకున్న ప్రయోజనాలన్నీ భారత ప్రభుత్వ సైనిక జోక్యంతో తెలంగాణ ప్రజలు కోల్పోయారు. అందుకే సెప్టెంబర్‌ 17ని విద్రోహదినంగా పాటించాలని వాదిస్తున్నారు చాలామంది. పరస్పర విలీన ఒప్పందాలేవీ లేనందువల్ల హైదరాబాద్‌ సంస్థానంపై జరిగిన పోలీస్‌ యాక్షన్‌ని దురాక్రమణే అని వారంటున్నారు. ఇది విమోచన పేరుతో జరిగిన విద్రోహమని గట్టిగా వాదిస్తున్నారు.

Tags:    

Similar News