శత్రు ఆస్తులపై తక్షణమే సర్వే
ఎనిమీ ప్రాపర్టీస్ వేలం ద్వారా 107 కోట్ల ఆదాయం;
స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కేసులను ఈనెలాఖరు (ఆగస్టు 31)లోపు పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యలను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఎనిమీ ప్రాపర్టీస్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో కేంద్ర బండి సంజయ్ స్వాతంత్ర సమరయోధులు మరియు పునరావాస విభాగం (FFR) సీనియర్ అధికారులు, ఇండియాలో శత్రు ఆస్తుల సంరక్షక (CEPI) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్లు, శత్రు ఆస్తుల ఆర్థికీకరణ, శరణార్థుల పునరావాసంపై అధికారులు కేంద్ర మంత్రికి సమగ్ర నివేదిక అందజేశారు. స్వాతంత్ర సైనిక్ సత్కార యోజన (SSSY) కింద పెండింగ్‌లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు, వారిపై ఆధారపడ్డ జీవిత భాగస్వాములు/కుమార్తెల పెన్షన్ కేసుల పరిష్కారంలో సాధించిన పురోగతి వివరాలను సైతం వివరించారు.
స్వాతంత్ర సైనిక్ సత్కార యోజన (SSSY)కు సంబంధించి హోంమంత్రిత్వ శాఖవద్ద 26 వేల 623 మంది ఫైళ్లు పెండింగ్ లో ఉండగా, ఇప్పటి వరకు 13 వేల మందికిపైగా పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 12212 మందికి లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. అట్లాగే స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్లకు సంబంధించి 8829 ఫైళ్లు పెండింగ్ లో ఉండగా, ఇప్పటి వరకు 6700 ఫైళ్లను క్లియర్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 2103 మందికి లబ్ది చేకూరినట్లు తెలిపారు.
ఎనిమి ప్రాపర్టీస్ (శత్రు ఆస్తులు) విషయానికొస్తే... దేశవ్యాప్తంగా 12800 శత్రు ఆస్తులున్నాయని సంబంధిత విభాగం అధికారులు మంత్రి ద్రుష్టికి తెచ్చారు. వీటిలో 1427 ప్రాపర్టీస్ కు సంబంధించిన వివాదాలను పరిష్కరించి ఆయా ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చినట్లు తెలిపారు. 1300కుపైగా ప్రాపర్టీస్ యూపీకి సంబంధించినవేనని వివరించారు. మరో 616 ఎనిమీ ప్రాపర్టీస్ లో వేలం వేయగా, వాటిలో 313 ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తయిందన్నారు. వాటిద్వారా రూ.107 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరినట్లు పేర్కొన్నారు. ఎనిమీ ప్రాపర్టీస్ కు సంబంధించి 3,300కుపైగా కేసులు న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో 440 ఆస్తులకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయ్యిందని వివరించారు.
ఈ సందర్భంగా ఫ్రీడం ఫైటర్స్, ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పరిష్కారంలో అధికారులు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. పెండింగ్ లో ఉన్న మిగిలిన పెన్షన్ దరఖాస్తులను సైతం వేగవంతం చేసి ఈనెలాఖరు (ఆగస్టు 31) లోపు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవసరమైన పత్రాలు అందకపోవడం వల్ల పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొనడంతో వెంటనే ఈ విషయంపై రాష్ట్రాలకు లేఖలు పంపాలని స్వాతంత్ర సమరయోధులు, పునరావాస విభాగం జాయింట్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి పత్రాలను సేకరించి, పెన్షన్ మంజూరును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను రాష్ట్రాలకు పంపాలని కోరారు.
శత్రు ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ద్రుష్టి సారించాలని సంబంధిత విభాగం అధికారులను కేంద్ర మంత్రి కోరారు. అందులో భాగంగా యుద్ద ప్రాతిపదికన సర్వే, సరిహద్దు నిర్ధారణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై పూర్తి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో శత్రు ఆస్తులు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వెంటనే ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపి, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే వచ్చే నెలలో CEPI శాఖ కార్యాలయాలను స్వయంగా సందర్శించి పురోగతిని సమీక్షించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ సమావేశానికి జాయింట్ సెక్రటరీ (FFR) తోపాటు ఇండియాలో శత్రు ఆస్తుల సంరక్షకుడు ఆర్. ప్రసన్న, అలాగే FFR విభాగం, CEPI కార్యాలయం సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.