Fund for Iran: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల నిధి.. అమెరికా ప్రభుత్వ సొమ్ము కాదని స్పష్టీకరణ
అమెరికా ప్రభుత్వ సొమ్ము కాదని స్పష్టీకరణ
Fund for Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం రెండు రోజుల్లో అధికారికంగా సంతకాలు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని వార్తలు వచ్చినా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని స్పష్టంగా తోసిపుచ్చారు.
అయితే, ఇరాన్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 300 బిలియన్ డాలర్లతో ప్రైవేట్ ఫండ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఈ ఒప్పందంలో భాగంగా ఉందని తెలుస్తోంది. శుక్రవారం సంతకాల ముందే ఫండ్ వివరాలపై సగం స్పష్టత వచ్చినట్లు సమాచారం.
ట్రంప్ స్పష్టీకరణ:
“ఇరాన్‌కు అమెరికా 300 బిలియన్ డాలర్లు చెల్లించడం లేదు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు అభివృద్ధి చేయదని మాట ఇచ్చింది” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికా సమకూర్చే నిధులు ప్రైవేటు పెట్టుబడుల రూపంలోనే ఇరాన్‌కు చేరనున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇది ఎలాంటి నష్టపరిహారం కాదు. ప్రభుత్వ నిధులు లేదా గ్రాంట్లు ఈ ఫండ్‌లో ఉండవు. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి.
నేపథ్యం:
యుద్ధం వల్ల కలిగిన నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరిన ఇరాన్ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. ఆ తర్వాతే పునర్నిర్మాణ-అభివృద్ధి ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. స్టీల్ కాంప్లెక్స్‌లు, రిఫైనరీలు, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రుణాలు, క్రెడిట్ లైన్లు, డైరెక్ట్ ఫైనాన్సింగ్ ద్వారా సహకరించాలని యోచిస్తున్నారు.
40 ఏళ్లుగా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్‌లో విదేశీ పెట్టుబడులు పరిమితంగా ఉన్నాయి. అయినా గ్యాస్, చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న ఈ దేశంలో విద్యావంతులైన యువ జనాభా పెద్ద ఎత్తున ఉంది. పెట్రోకెమికల్స్, మైనింగ్, టూరిజం, వ్యవసాయ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆంక్షల వల్ల విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులకు మాత్రం ఈ ఫండ్‌తో సంబంధం లేదు.
ఈ ఒప్పందం ఇరాన్ ఆర్థిక అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుస్తుందని భావిస్తున్నారు.