US: పశ్చిమాసియాలో తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం సాగుతున్నా.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు ఇతర అగ్రనాయకులకు అమెరికా వీసాలు ఆమోదించింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) 81వ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా అనుమతి ఇచ్చింది. అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా కీలక అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ‘‘ఆతిథ్య దేశంగా మాకున్న బాధ్యతలకు అనుగుణంగా ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొంటుంది’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉంటుందని, వారిపై ప్రయాణ ఆంక్షలు వర్తిస్తాయని, విలాస వస్తువులు, ఇతర వస్తువుల కొనుగోలుపై నిషేధం ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ దేశం కోరుకుంటోందని, అయితే అందుకు అవసరమైన షరతులను అంగీకరించడానికి సిద్ధంగా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘‘మనం చేసుకుంటే మంచి ఒప్పందం చేసుకుందాం. లేకపోతే లేదు’’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇరాన్ ప్రతినిధులకు వీసాలు ఇచ్చిన అమెరికా.. పాలస్తీనా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి మాత్రం వీసాలను తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం విషయంలో తమ వాగ్దానాలను నిలుపుకోవడంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ సహా ఇతర ఉన్నతాధికారులు విఫలమయ్యారని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

మరోవైపు, ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో తిష్ఠ వేసిన అగ్రదేశాలే అంతర్జాతీయ చట్టాలను ఇష్టారీతిగా ఉల్లంఘిస్తున్నాయని, అందువల్లే ఈ ఉమ్మడి వేదిక నిస్తేజంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ వేదికను తక్షణమే సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Tags: