US-Iran Tensions: ఒప్పందం ముగిసింది.. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు

మరోసారి ఉద్రిక్తతలు

Update: 2026-07-09 05:56 GMT

US-Iran Tensions: అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందం (ఎంవోయూ)ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చీల్చేశారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి భంగం కావడంతో యుద్ధం మళ్లీ తలెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వైమానిక దాడులు, క్షిపణి ప్రయోగాలు, డ్రోన్ దాడులతో ప్రాంతం దద్దరిల్లింది. హార్ముజ్ సముద్రంలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. అమెరికా ఇరాన్ చమురు విక్రయంపై మళ్లీ ఆంక్షలు విధించింది.

ట్రంప్ ప్రకటన

నాటో సమావేశాలకు తుర్కియేలోని అంకారాకు వెళ్లిన ట్రంప్ దాడుల తర్వాత మాట్లాడుతూ, “నా దృష్టిలో కాల్పుల విరమణ పని అయిపోయింది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలు కొనసాగించవచ్చు. కానీ అది వృథా ప్రయాస మాత్రమే” అని చెప్పారు. ఇరాన్‌ను ‘దుర్మార్గులు’, ‘వికృత మనస్తత్వం’ కలిగినవారని విమర్శించారు. పౌర లక్ష్యాలపై దాడులు చేసే అవకాశం ఉందని, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, విద్యుత్ కేంద్రాలు, డీశాలినైజేషన్ ప్లాంట్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన ప్రకారం, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లు, పారామిలిటరీ గార్డులు వాడే 60 చిన్న బోట్లపై బాంబు దాడులు చేశారు. మొత్తం 80 లక్ష్యాలను ధ్వంసం చేశారు. హార్ముజ్‌లో రవాణాను అడ్డుకోవడానికి ఇరాన్ చిన్న బోట్లను వాడుతోందని తెలిపారు. బందర్, మషహర్, బుషెహర్ (అణు విద్యుత్ ప్లాంటు)లపై కూడా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఒక గార్డు మరణించినట్లు తెలిపింది.

ఇరాన్ ప్రతీకారం

ఇరాన్ విదేశాంగశాఖ “అమెరికా దాడులు తీవ్ర ఉల్లంఘన. ఎంవోయూకు తూట్లు పొడిచాయి” అని ఖండించింది. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్, కువైట్‌లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. హార్ముజ్‌లో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైనా దాడులు జరిపింది. 85 అమెరికా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఖతార్ నుంచి సహజ వాయువు తీసుకెళ్తున్న నౌకపై దాడి చేసినట్లు ఖతార్ విదేశాంగశాఖ తెలిపింది.

ప్రస్తుతం హార్ముజ్ ప్రాంతంలో 6,000 మంది నావికులు చిక్కుకున్నారని అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ చెప్పింది. పర్షియన్ గల్ఫ్‌లో 9 భారత ట్యాంకర్లు (198 మంది నావికులు) చిక్కుకున్నాయని సమాచారం. గల్ఫ్ సహకార మండలి ఈ దాడులను ఖండించింది.

ఆర్థిక ప్రభావం

యుద్ధ ఉద్రిక్తతతో ముడి చమురు ధరలు పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరాయి. భారత్‌తో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా పతనం చెందాయి. రూపాయి బలహీనపడింది. బంగారం, వెండి ధరలు తగ్గాయి.

ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News