China Launches Massive Warship ‘Fujian’: అమెరికాతో పోటీగా.. చైనా భారీ యుద్ధనౌక ‘ఫుజియాన్’ ప్రారంభం
చైనా భారీ యుద్ధనౌక ‘ఫుజియాన్’ ప్రారంభం
స్వదేశీ సాంకేతికతతో నిర్మిత టైప్-003 విమానవాహక నౌక
80 వేల టన్నుల బరువు.. 50 ఫైటర్ జెట్ల సామర్థ్యం
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా పరిశీలన
అణుశక్తి ఆధారిత టైప్-004 నౌక నిర్మాణానికి సన్నాహాలు
China Launches Massive Warship ‘Fujian’: అమెరికాతో నావికా రంగంలో నుంచి పోటీ పడేందుకు చైనా మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ‘ఫుజియాన్’ (టైప్-003)ను బుధవారం అధికారికంగా సేవల్లోకి ప్రవేశపెట్టింది. హైనాన్ ద్వీపంలోని యులిన్ నౌకాశ్రయంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా ఈ భారీ నౌకను పరిశీలించారు.
చైనాకు చెందిన మూడో సూపర్ క్యారియర్ అయిన ఫుజియాన్.. అమెరికాకు మాత్రమే ఉన్న అత్యాధునిక విద్యుదయస్కాంత కెటపల్ట్ వ్యవస్థ (ఎమాల్స్ - EMALS)ను కలిగి ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికాకు చెందిన ‘గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ తరగతి నౌకల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఫుజియాన్ ప్రత్యేకతలు
పొడవు: 316 మీటర్లు
బరువు: 80,000 టన్నులు
విమానాల సామర్థ్యం: 50కిపైగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు
ప్రొపల్షన్: సాంప్రదాయ ఇంధనం + అత్యాధునిక ఎమాల్స్ కెటపల్ట్
ఫ్లైట్ డెక్: 3 కెటపల్ట్‌లు, ఒకేసారి బహుళ విమానాల ప్రయాణం సాధ్యం
ఈ కార్యక్రమంలో షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘ఫుజియాన్ సేవల్లోకి రావడం.. మన సాయుధ దళాల ఆధునికీకరణలో చారిత్రక మైలురాయి. ఇది చైనా గౌరవాన్ని, భద్రతను కాపాడే వ్యూహాత్మక ఆయుధం’’ అని కొనియాడారు.
ఇదే ఊపులో చైనా నాలుగో విమానవాహక నౌక ‘టైప్-004’ నిర్మాణానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఈసారి అణుశక్తితో నడిచే సూపర్ క్యారియర్‌గా.. ఎమాల్స్ సాంకేతికతతో పాటు అంతులేని ప్రయాణ సామర్థ్యంతో రూపొందనుంది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యానికి చైనా నేరుగా సవాల్ విసురుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.