China’s Nuclear Arms Expansion: చైనా అణు ఆయుధ విస్తరణ: కొత్త సిలో ఫీల్డ్స్ ల్లో 100కు పైగా ఖండాంతర క్షిపణుల మోహరింపు.. పెంటగాన్ ఆందోళన
పెంటగాన్ ఆందోళన
China’s Nuclear Arms Expansion: అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజా నివేదికలో చైనా అణు ఆయుధాల విస్తరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా నిర్మించిన మూడు సిలో ఫీల్డ్స్‌లో 100కు పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBMలు) చైనా మోహరించి ఉండవచ్చని అంచనా వేసింది. ఈ క్షిపణులు మంగోలియా సరిహద్దు సమీపంలో ఉన్నాయని, ఇవి సాలిడ్ ఫ్యూయల్ ఆధారిత DF-31 రకం క్షిపణులని పేర్కొంది. మరే అణుశక్తి దేశం చేయని విధంగా చైనా తన అణు మరియు సైనిక మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తోందని నివేదికలో ఆరోపించింది.
గతంలో ఈ సిలో సైట్ల ఉనికిని పెంటగాన్ వెల్లడించినప్పటికీ, అందులో మోహరించిన క్షిపణుల సంఖ్యను ఇప్పుడే ప్రకటించింది. 2024 నాటికి చైనా వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య 600కు మించలేదని, అయితే 2030 నాటికి ఈ సంఖ్య 1,000 దాటవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఆయుధ నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది.
ఈ ఆరోపణలపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, తమ దేశాన్ని కించపరచడానికి ఇలాంటి నివేదికలు విడుదల చేస్తోందని వాషింగ్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయం ఖండించింది. తమ జాతీయ భద్రతను కాపాడుకునేందుకు కనీస స్థాయిలో అణు మోహరింపులు కొనసాగిస్తామని చైనా స్పష్టం చేసింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, రష్యాలతో అణు నిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశం ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయినా చైనా ఈ చర్చలపై ఆసక్తి చూపడం లేదన్న నేపథ్యంలో పెంటగాన్ ఈ నివేదికను విడుదల చేసింది. చైనా అణు విస్తరణ ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను తెస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.