Controversy Erupts Over Epstein Links: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో మరో మలుపు తిరిగింది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ సాక్స్‌లో న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న కేతీ రుయెమ్లర్‌ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఎప్‌స్టీన్‌తో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈమెయిల్‌లలో రుయెమ్లర్‌, ఎప్‌స్టీన్‌ను 'పెద్దన్న' అంటూ సంబోధించడం గమనార్హం. ఈ ఈమెయిల్‌లు ఆమెకు, ఎప్‌స్టీన్‌కు మధ్య గాఢమైన అనుబంధాన్ని సూచిస్తున్నాయి.

మొదట్లో ఈ ఆరోపణలను రుయెమ్లర్‌ ఖండించారు. తనకు ఆ ఈమెయిల్‌లతో ఎలాంటి సంబంధం లేదని, పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే, వివాదం ముదిరి, ఒత్తిడి పెరగడంతో చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. బరాక్‌ ఒబామా అధ్యక్ష పదవి కాలంలో రుయెమ్లర్‌ వైట్‌హౌస్‌లో అధ్యక్షుని వ్యక్తిగత న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఎప్‌స్టీన్‌ నుంచి ఆమె ఖరీదైన బహుమతులు స్వీకరించినట్టు తెలుస్తోంది.

అమెరికా ఆర్థిక సేవల రంగంలో ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి బహుమతులు అందుకోవడం కఠిన నియమాలకు లోబడి ఉంటుంది. ఇలాంటి బహుమతులు స్వీకరించరాదన్న రూల్స్‌ను ఉల్లంఘించినట్టు భావించి రుయెమ్లర్‌పై ఒత్తిడి పెరిగింది. 2008లోనే ఎప్‌స్టీన్‌ను లైంగిక నేరగాడిగా కోర్టు గుర్తించింది. అతడు అనేకమంది బాలికలు, మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసి, వారిని ప్రపంచ నాయకులకు ఎరగా వాడుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం పలు దేశాల్లో రాజకీయ ఉత్పాతాలకు కారణమైంది. ఈ కేసు ఇంకా ఎన్నో రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉంది.

Tags: