Actor Dhanush: రాయన్ జాతీయ అవార్డుపై విమర్శలు.. రాజకీయాల్లోకి ధనుష్ అనే చర్చలు
రాజకీయాల్లోకి ధనుష్ అనే చర్చలు
Actor Dhanush: తమిళ నటుడు, దర్శకుడు ధనుష్ తన చిత్రం ‘రాయన్’కు లభించిన జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ స్పష్టంగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులకు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునివ్వడంతో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. దీనిపై ‘ఆ ఏడాది మరిన్ని మంచి సినిమాలు వచ్చాయి, వాటికి ఎందుకు ఇవ్వలేదు’ అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తిరువళ్ళూరు జిల్లాలోని ఓ వైద్య కళాశాలలో అభిమాన సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ధనుష్ ఈ విమర్శలపై స్పందించారు.
“రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు రావడం వెనుక ఎలాంటి సిఫారసు లేదు. ఒక తమిళుడిగా ఈ అవార్డులు వచ్చాయి. నన్ను భుజం తట్టి ప్రోత్సహించండి. మహారాజా, మెయ్యళగన్ వంటి చిత్రాలు మెరుగ్గా ఉండవచ్చు. కానీ నేను నటించిన పుదుపేట, 3, మయక్కం ఎన్న, మరియాన్, వడా చెన్నై, కర్ణన్ వంటి సినిమాలకు అవార్డులు రావాలని అనుకున్నాం. రాలేదు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు?” అని ధనుష్ అన్నారు. విమర్శలను పక్కనపెట్టి విజయాన్ని ఎంజాయ్ చేయాలని కూడా సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదే సందర్భంలో ధనుష్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్‌లకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. “ఇంతమంది ఒకే చోట సమావేశం కావడం చిన్న విషయం కాదు. ఈ ఐక్యతలో శక్తి ఉంది. మీ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను అర్థం చేసుకొని సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు చేయండి” అని అన్నారు.ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని ప్రారంభించిన తరహాలోనే ధనుష్ కూడా రాజకీయ ప్రవేశం చేస్తారని అభిమానులు, నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.