Donald Trump : ట్రంప్ కొత్త ఆంక్షలు.. 12దేశాల ప్రజలకు అమెరికా ప్రవేశం నిషేధం

12దేశాల ప్రజలకు అమెరికా ప్రవేశం నిషేధం;

Update: 2025-06-05 08:19 GMT

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇరాన్ సహా మొత్తం 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధం విధించారు. ఇది కొత్త ప్రయాణ నిషేధం అని ట్రంప్ ప్రకటించారు. దీనితో పాటు, మరో ఏడు దేశాలపై పాక్షిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో ఈ దేశాల ప్రజలు ఇకపై అమెరికాలోకి ప్రవేశించలేరు.

పూర్తి నిషేధం విధించిన 12 దేశాలు ఇవే!

రాయిటర్స్ నివేదికల ప్రకారం.. అమెరికాలో ప్రవేశం నిషేధించిన 12 దేశాల పౌరుల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ (బర్మా), చాద్ , కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయి. ఈ ఆంక్షలు సోమవారం, 2025 జూన్ 9న ఉదయం 12:01 గంటల నుండి అమల్లోకి వస్తాయి.

పాక్షిక ఆంక్షలున్న 7 దేశాలు!

పూర్తి నిషేధంతో పాటు.. ట్రంప్ మరో ఏడు దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. ఈ దేశాల పౌరులు వీసాల కోసం ప్రత్యేక పరిశీలన, అదనపు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆ దేశాలు.. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్ , టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా.

నిషేధానికి ట్రంప్ చెప్పిన కారణం!

ఈ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, "అమెరికా జాతీయ భద్రత, మన పౌరుల రక్షణ కోసం నేను ఈ కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చింది" అని అన్నారు. వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ మాట్లాడుతూ.. పూర్తి నిషేధం విధించిన దేశాలు అమెరికా భద్రతా తనిఖీ, స్క్రీనింగ్ ప్రక్రియలో విఫలమయ్యాయని తెలిపారు. కొన్ని దేశాలలో ఉగ్రవాదానికి ప్రభుత్వ మద్దతు ఉండటం, మరికొన్ని దేశాలలో వీసా ఓవర్‌స్టే రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఆంక్షలు విధించినట్లు తను వివరించారు.

ఏ వీసాలు ప్రభావితం అవుతాయి?

ఈ ప్రయాణ నిషేధం కేవలం ఇమ్మిగ్రెంట్ వీసాలకు మాత్రమే పరిమితం కాదు. ఇందులో అనేక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు కూడా ఉన్నాయి:

B-1 (బిజినెస్ వీసా): వ్యాపార వీసా

B-2 (టూరిస్ట్ వీసా): పర్యాటక వీసా

F (స్టూడెంట్ వీసా): విద్యార్థి వీసా

M (వొకేషనల్ వీసా): వృత్తి విద్యా వీసా

J (ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీసా): ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీసా

Tags:    

Similar News