Donald Trump: ట్రంప్ తీవ్ర హెచ్చరిక: నేటి రాత్రితో ఇరాన్ నాగరికత అంతం!
నేటి రాత్రితో ఇరాన్ నాగరికత అంతం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు. “ఈ రాత్రి ముగిసే సరికి ఇరాన్ నాగరికత మొత్తం అంతమవుతుంది. దాన్ని ఎప్పటికీ తిరిగి నిర్మించలేము” అని ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టు చేశారు. ఇరాన్‌లో గత 47 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి, అరాచక పాలనకు ఈ రాత్రి తెరపడనుందని, ప్రపంచ చరిత్రలో ఇది ఒక మైలురాయి అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తనకు ఇష్టం లేదని, కానీ పరిస్థితులు అలా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇరాన్‌లో తాజాగా కొత్త, తెలివైన నాయకత్వం వచ్చినందున అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆశావాదం వ్యక్తం చేశారు.
సోమవారం ట్రంప్ ఇచ్చిన ముందస్తు హెచ్చరికలు గుర్తుండాలి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరికొన్ని గంటల్లో తెరవకపోతే, ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించడంతో ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దళాలు ఇప్పటికే దాదాపు 50 లక్ష్యాలపై దాడులు జరిపినట్లు వెల్లడైంది. అక్కడి రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. ఈ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి మెరైన్‌లతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దాడులు కొనసాగుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాత్రం పౌర, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపితే అంతర్జాతీయ నేరంగా పరిగణించబడతాయని హెచ్చరించినా అమెరికా తన చర్యలను కొనసాగిస్తోంది.
ఇరాన్ తరపున స్పందన: ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. “అమెరికా, దాని మిత్రదేశాలు పురాతన నాగరికత కలిగిన ఇరాన్ నుంచి మరచిపోలేని దెబ్బ తినబోతున్నాయి” అని దక్షిణ ఆఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసింది.
ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. నేటి రాత్రి ఏం జరుగుతుందో అన్నది ప్రపంచం ఉద్వేగంగా ఎదురు చూస్తోంది.