DonaldTrump: ఇరాన్‌ యుద్ధం కేవలం రెండు నెలలు మాత్రమే.. త్వరలో విజయం సాధిస్తాం: ట్రంప్‌ ధీమా వ్యాఖ్యలు

త్వరలో విజయం సాధిస్తాం: ట్రంప్‌ ధీమా వ్యాఖ్యలు

Update: 2026-04-17 05:24 GMT

DonaldTrump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్చ్‌.. మేము ఇరాన్‌తో కేవలం రెండు నెలలే యుద్ధం చేశాం” అని ఆయన అన్నారు. అమెరికా గతంలో చేసిన ఇతర యుద్ధాలు 18 ఏళ్లు, నాలుగేళ్లు కొనసాగాయని, ఈ తాజా యుద్ధంలో మాత్రం త్వరలోనే విజయం సాధించనున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగకపోతే చెడు పరిణామాలు జరిగేవని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ఇరాన్‌లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చమురు ధరలపై స్పందిస్తూ “రానున్న వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం” అని అన్నారు. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలా వద్దా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. టెహ్రాన్‌ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఆ విషయంపైనే దృష్టి సారించామని ట్రంప్‌ చెప్పారు. చర్చల్లో పురోగతి సాధిస్తే కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం ఉండదని, ఈ వారాంతంలో తదుపరి చర్చలు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని పునరుద్ఘాటించిన ట్రంప్‌, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించడానికి ఇరాన్‌ అంగీకరించిందని చెప్పారు. ఇది గొప్ప విషయమని అభివర్ణించి, త్వరలో జరగనున్న చర్చలు సానుకూలంగా ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంగా లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇది తాను ఆపిన 10వ యుద్ధమని, ఇంతకుముందు తొమ్మిది యుద్ధాలు ఆపినట్లు గుర్తు చేశారు. ఇది తనకు గొప్ప గౌరవమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News