Donald Trump: ఇరాన్ యురేనియం నిల్వలు అమెరికా భూభాగానికి తరలిస్తాం: ట్రంప్ కీలక ప్రకటన

ట్రంప్ కీలక ప్రకటన

Update: 2026-04-18 04:18 GMT

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యురేనియం విషయంలో మరోసారి బలమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని అణుకేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా భూభాగంలోకి భౌతికంగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరిజోనాలో జరిగిన ఒక ప్రజా కార్యక్రమంలో ప్రసంగించిన ట్రంప్ ఈ అంశాన్ని వివరంగా తెలిపారు.

ఇరాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్న తర్వాత ఆ దేశ అణుకేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తవ్వి తీసుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. దీనికోసం భారీ సామగ్రి అవసరమని, త్వరలోనే ఆ యురేనియంను అమెరికా భూభాగానికి రవాణా చేస్తామని వెల్లడించారు. ఇంతకుముందు కూడా ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టెహ్రాన్ ఆ ప్రకటనను తోసిపుచ్చింది. తమ దేశంలో ఉన్న యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మరోసారి స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలోనూ ట్రంప్ తన వ్యాఖ్యలను కొనసాగించడం గమనార్హం.

అంతేకాకుండా, హర్మూజ్ జలసంధిని తెరిచినప్పటికీ ఇరాన్‌తో పూర్తి ఒప్పందం కుదరకపోతే దిగ్బంధనాలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలను వదిలేస్తామని తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందని కూడా అన్నారు.

నాటో సహాయం అవసరం లేదు.. గతంలోనే సద్దుమణిగాయి సమస్యలు

ఈ సందర్భంగా నాటో కూటమిపైనా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఉద్రిక్తతల సమయంలో నాటో అసమర్థంగా వ్యవహరించిందని, ఇకపై తనకు ఆ కూటమి సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. “హర్మూజ్ జలసంధి సమస్యలు దాదాపు అన్నీ సద్దుమణిగాయి. ఇప్పుడు సహాయం కావాలా అని నాటో నుంచి ఫోన్ వచ్చింది. రెండు నెలల క్రితమే మీ సహాయం కావాల్సి ఉండేది. ఇప్పుడు అవసరం లేదు అని చెప్పాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నాటోతో తమకు ఎప్పుడూ సహాయం అవసరం పడలేదని, వారికి మాత్రమే తమ అవసరం ఎంతగానో ఉండేదని ట్రంప్ అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఇరాన్-అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తతల వైపు మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News