Donald Trump: చరిత్ర సృష్టించనున్న ట్రంప్... అమెరికా డాలర్ నోట్లపై అధ్యక్షుడి సంతకం!
అమెరికా డాలర్ నోట్లపై అధ్యక్షుడి సంతకం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాస్తున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేసే మొదటి అధ్యక్షుడిగా నిలవనున్నారు. యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షిక వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. 1861 నుంచి అంటే గత 165 ఏళ్లుగా అమెరికా నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకాలు మాత్రమే ఉండేవి. ఈ సంప్రదాయాన్ని ట్రంప్ ఇప్పుడు బద్దలు కొడతారు.
ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో పాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను జూన్ నెలలో ముద్రించనున్నారు. భవిష్యత్తులో ముద్రించే అన్ని కొత్త నోట్లపై ట్రంప్ సంతకం ఉండనుంది.
ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, “మన దేశం సాధించిన చారిత్రక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదు. అమెరికా సెమీక్విన్‌సెంటెన్నియల్ (250వ వార్షికం) సందర్భంగా ట్రంప్ సంతకంతో కూడిన ఈ చారిత్రక నోట్లు విడుదల చేయడం సముచితం” అని అన్నారు.
ఇటీవల ట్రంప్ ముఖచిత్రంతో స్మారక నాణేలు తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీజ్ కూడా ఈ అభివృద్ధికి సంబంధించి సానుకూలంగా స్పందించారు.
ఈ మార్పు అమెరికా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగానే ఆయన సంతకం డాలర్ నోట్లపై ముద్రించడం ఇదే మొదటిసారి. ఈ నోట్లు త్వరలో ప్రజల చేతికి చేరనున్నాయి.