Drug Mafia Don ‘El Mencho’ Killed in Mexican: ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ అక్రమ రవాణాతో దేశాలను వణికించిన భయంకరమైన మాఫియా డాన్‌ నెమెసియో ఒసెగురా సెర్వాంటెస్‌ అలియాస్‌ ఎల్‌ మెంచో.. మెక్సికో సైన్యం చేతికి చిక్కి హతమయ్యాడు. జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో సైనికులు జరిపిన తీవ్రమైన కాల్పుల్లో అతడు గాయపడి, మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు రక్షణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటన మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఎల్‌ మెంచో అనుచరులు వాహనాలను తగలబెట్టి, రహదారులను అడ్డుకుని ఆందోళనలు వ్యక్తం చేశారు.

ఎల్‌ మెంచో నేతృత్వంలోని జాలిస్కో న్యూజనరేషన్‌ కార్టెల్‌ (సీజేఎన్‌జీ) గత దశాబ్దకాలంగా మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సంస్థగా మారింది. అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేసే ప్రధాన మాఫియా గ్యాంగ్‌గా పేరొందిన ఈ సంస్థ.. కొకైన్‌, మెథాంఫెటమైన్‌ వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకుని, అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని సృష్టించింది. మెక్సికో ప్రభుత్వం, అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) ఎల్‌ మెంచోను అత్యంత వాంటెడ్‌ నేరస్థుడిగా ప్రకటించాయి. అతడిని పట్టుకున్న వారికి అమెరికా 10 మిలియన్‌ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది.

సైనిక ఆపరేషన్‌ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటన తర్వాత మెక్సికోలో డ్రగ్‌ మాఫియా గ్యాంగ్‌ల మధ్య హింస పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎల్‌ మెంచో మరణం మెక్సికో డ్రగ్‌ యుద్ధంలో కీలక మలుపుగా మారనుంది.

Tags: