Ebola Panic in Congo: కాంగోలో ఎబోలా కలకలం – ర్వాంపారాలో చికిత్సా కేంద్రం దహనం
ర్వాంపారాలో చికిత్సా కేంద్రం దహనం
Ebola Panic in Congo: ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మళ్లీ తలెత్తి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తితో పాటు తప్పుడు సమాచారం, స్థానిక సంప్రదాయాలు, అపనమ్మకాలు కలిసి ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లోని ర్వాంపారా ప్రాంతంలో ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించారు.
ఎబోలా లక్షణాలతో మృతిచెందిన ఒక యువకుడి మృతదేహాన్ని అప్పగించడానికి వైద్య సిబ్బంది నిరాకరించడంతో స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చికిత్సా కేంద్రంలోకి చొరబడి నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారిని అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనలో కొన్ని టెంట్లు, వైద్య సామగ్రి, మృతదేహాలు కాలిపోయినట్లు సమాచారం. ఈ సంఘటన ఎబోలా నియంత్రణ చర్యలకు తీవ్ర అవరోధం కలిగించింది.
17వసారి ఎబోలా వ్యాప్తి
1976లో కాంగోలో తొలిసారి గుర్తించిన ఎబోలా వైరస్ ప్రస్తుతం 17వసారి వ్యాప్తి చెందుతోంది. ఈసారి బుండిబుగ్యో స్ట్రెయిన్‌తో వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రత్యేక వ్యాక్సిన్ లేకపోవడం వల్ల నియంత్రణ కష్టంగా మారింది.
బుష్‌మీట్, అంత్యక్రియలు కారణం?
ఎబోలా సాధారణంగా గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అడవి జంతువుల మాంసం (బుష్‌మీట్) తినడం ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 2 నుంచి 21 రోజులు పడుతుంది. జ్వరం, శరీర నొప్పులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మృతుల అంత్యక్రియల సంప్రదాయాలు (శరీరాన్ని తాకడం, సమీపంగా ఉండటం) వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయి. ఇలాంటి సంప్రదాయాలు, వైద్య చర్యల మధ్య ఏర్పడుతున్న విభేదాలు ప్రజల్లో అపనమ్మకానికి దారి తీస్తున్నాయి.
ఈ ఘటన ఎబోలా నియంత్రణలో ఎదురవుతున్న సవాళ్లను తెలియజేస్తోంది. అధికారులు స్థానికులతో సమన్వయం పెంచి, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.