Epstein Files Go Missing: ఎప్‌స్టీన్‌ ఫైళ్లు మాయం: ట్రంప్‌ ఫొటో ఉన్న చిత్రంతో పాటు 16 పత్రాలు అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యం!

16 పత్రాలు అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యం!

Update: 2025-12-21 06:45 GMT

Epstein Files Go Missing: ప్రపంచాన్ని కలచివేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ ట్రాఫికింగ్‌ కుంభకోణానికి సంబంధించిన పత్రాల విడుదలలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా న్యాయశాఖ (DOJ) శుక్రవారం విడుదల చేసిన వేలాది పత్రాల్లోంచి దాదాపు 16 ఫైళ్లు ఒక్క రోజులోనే వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యమయ్యాయి. ఈ మాయమైన ఫైళ్లలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో ఉన్న ఒక చిత్రం కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఎప్‌స్టీన్‌ ఇంటి శోధనల సమయంలో తీసిన ఫొటోల్లో ఒకటి – డ్రాయర్‌లో ఉంచిన అనేక చిత్రాల మధ్య ట్రంప్‌, మెలానియా ట్రంప్‌, ఎప్‌స్టీన్‌ మరియు గిస్లైన్‌ మాక్స్‌వెల్‌లతో కూడిన ఫొటో ఉంది. ఈ ఫైల్‌ (నంబర్‌ 468)తో పాటు నగ్న బొమ్మలు గీచిన పెయింటింగ్‌ల చిత్రాలు, ఇతర సున్నితమైన దృశ్యాలు ఉన్న ఫైళ్లు కూడా మాయమయ్యాయి. వీటిని ఉద్దేశపూర్వకంగా తొలగించారా లేక సాంకేతిక సమస్యవల్లనా అనేది న్యాయశాఖ ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

శుక్రవారం విడుదలైన పత్రాల్లో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ వంటి ప్రముఖుల ఫొటోలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌లలోని ఇళ్ల దృశ్యాలు, బాధితుల వాంగ్మూలాలు, అంతర్గత మెమోలు కూడా భాగమే. అయితే ట్రంప్‌కు సంబంధించిన ప్రస్తావనలు చాలా తక్కువగానే ఉన్నాయి.

ఈ ఘటనపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీలోని డెమోక్రాట్లు న్యాయశాఖపై మండిపడుతూ, అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. “ఇంకా ఏమేమి దాచిపెడుతున్నారు? అమెరికన్‌ ప్రజలకు పూర్తి సమాచారం అవసరం” అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఎప్‌స్టీన్‌ ఫైళ్ల ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌ ప్రకారం అన్ని పత్రాలు విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటివరకు భారీగా రెడాక్ట్‌ చేసినవి మాత్రమే పబ్లిక్‌కు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని పత్రాలు రాబోయే రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ట్రంప్‌పై ఎటువంటి నేరారోపణలు లేవని, ఎప్‌స్టీన్‌తో పాత స్నేహం మాత్రమే ఉందని ఆయన పక్షం చెబుతోంది.

Tags:    

Similar News