NATO Secretary General Mark Rutte Warns: అమెరికా లేకుండా ఐరోపా స్వయంరక్షణ సాధ్యమే కాదు: నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే హెచ్చరిక
నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే హెచ్చరిక
NATO Secretary General Mark Rutte Warns: నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఐరోపా దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా సహాయం లేకుండా ఐరోపా తనను తాను రక్షించుకోలేదని, అలాంటి ఆలోచనలు కేవలం భ్రమలేనని స్పష్టం చేశారు.
బెల్జియంలోని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘అమెరికా మద్దతు లేకుండా ఐరోపా లేదా యూరోపియన్ యూనియన్ తన రక్షణను స్వయంగా చేసుకోగలదని ఎవరైనా అనుకుంటే... వారు కలలు కంటూనే ఉండవచ్చు. అది సాధ్యమయ్యే విషయం కాదు’’ అని పేర్కొన్నారు.
గ్రీన్‌లాండ్ వ్యవహారంలో అమెరికా-ఐరోపా మధ్య తాజాగా తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేసిన వ్యాఖ్యలు, ఐరోపా దేశాలపై సుంకాలు విధించే బెదిరింపులు వంటి అంశాలు రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే, నాటో చీఫ్ రుట్టే ట్రంప్‌తో జరిపిన చర్చల ఫలితంగా గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పడింది. దీంతో సుంకాలపై ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఐరోపా దేశాలు స్వతంత్రంగా నిలబడాలంటే రక్షణ ఖర్చులను గణనీయంగా పెంచాల్సి ఉంటుందని రుట్టే స్పష్టం చేశారు. ప్రస్తుతం నాటో సభ్య దేశాలు 2035 నాటికి తమ జీడీపీలో 3.5 శాతం రక్షణకు, 1.5 శాతం భద్రతా సంబంధిత మౌలిక సదుపాయాలకు కేటాయించాలని నిర్ణయించాయి. కానీ స్వయంరక్షణ కోసం ఈ మొత్తం 5 శాతం సరిపోదని, 10 శాతం వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందుకు స్వంత న్యూక్లియర్ సామర్థ్యం కూడా అవసరమని ఆయన వివరించారు.
‘‘అమెరికా లేకుండా మీరు మీ స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన హామీదారుడిని కోల్పోతారు. అది అమెరికా న్యూక్లియర్ ఛత్రం. కాబట్టి... శుభాకాంక్షలు!’’ అంటూ రుట్టే వ్యంగ్యంగా అన్నారు.
ఐరోపా, అమెరికా మధ్య సన్నిహిత సహకారం అత్యంత అవసరమని, రెండు పక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నాటో చీఫ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ పాలనలో నాటో సంబంధాలపై తలెత్తుతున్న చర్చలకు మరింత ఊపిరి పోస్తున్నాయి.