Gulf countries: అమెరికా చర్యలపై గల్ఫ్ దేశాల్లో అసంతృప్తి వాతావరణం
అసంతృప్తి వాతావరణం
Gulf countries: ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అనుసరిస్తున్న వైఖరి పట్ల కొన్ని గల్ఫ్ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా తమను అప్రమత్తం చేయకుండానే గత నెల 28న ఇరాన్‌పై సంయుక్త దాడులు ప్రారంభించారని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆకస్మిక దాడుల కారణంగా ఇరాన్ నుంచి వచ్చిన ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు తగిన సన్నాహాలు చేసుకునే అవకాశం తమకు లభించలేదని అమెరికా మిత్ర దేశాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌పై దాడి మొత్తం పశ్చిమాసియా ప్రాంతంలో విధ్వంసానికి దారి తీస్తుందని తాము ముందుగానే హెచ్చరించినా, అమెరికా దానిని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు తగిన భద్రతా చర్యలు అందించలేదని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని గల్ఫ్ దేశాల ప్రతినిధులు వాపోయారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ సొంత సైనిక దళాల రక్షణపైనే ఎక్కువ దృష్టి సారించాయని, గల్ఫ్ దేశాలను అనాథల్లా వదిలేశాయని పశ్చిమాసియా ప్రజలు భావిస్తున్నారని ఆ ప్రతినిధులు తెలిపారు. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి దాడులను అడ్డుకునేందుకు తమ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్‌ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల ప్రతినిధులు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడడానికి అంగీకరించడం లేదు. అయినప్పటికీ, ఆయా దేశాల ప్రముఖులు అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడిని అనవసర యుద్ధంలోకి లాగారని వారు బాహాటంగా చెబుతున్నారు.
‘ఇది నెతన్యాహు యుద్ధం’ అని సౌదీ అరేబియా మాజీ గూఢచార్య ప్రముఖుడు ప్రిన్స్ తుర్కి అల్ ఫైసల్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నుంచి వరుసగా ప్రయోగిస్తున్న డ్రోన్‌లను అడ్డుకోవడం తమకు సవాలుగా మారిందని పెంటగాన్ అధికారులు అమెరికా కాంగ్రెస్ సభ్యుల సమావేశంలో అంగీకరించారని సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ 380 క్షిపణులు, 1480 డ్రోన్‌లను గల్ఫ్ దేశాలపై ప్రయోగించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంలో ఇరాన్‌కు చెందిన షెహద్ డ్రోన్‌లను నిలువరించే సాంకేతికతను సాధించిన ఉక్రెయిన్ సాయాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలు కోరుతున్నాయి.
ఇరాన్ దాడులు 90 శాతం తగ్గాయి
మలిదశ ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా మరింత తీవ్రంగా దాడులు చేపట్టిన కారణంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం తగ్గిపోయాయని శ్వేతసౌధం ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు. తమ దాడులు ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేశాయని, దీంతో ఆ దేశం నుంచి క్షిపణి ప్రయోగాలు మందగించాయని ఆమె వివరించారు.