Indian Embassy in Qatar: ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ అలర్ట్: హయ్య ఏ1 వీసాదారులు తమ వివరాలు నమోదు చేయాలి
హయ్య ఏ1 వీసాదారులు తమ వివరాలు నమోదు చేయాలి
Indian Embassy in Qatar: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ముదిరిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని దేశాల్లో ఉండిపోయిన భారత పౌరుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సందర్భంగా ఖతార్‌లోని భారత దౌత్యకార్యాలయం ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. హయ్య ఏ1 (టూరిస్ట్) వీసా కలిగినవారు, తాత్కాలిక వీసాదారులు తక్షణమే ఎంబసీ అందించిన లింక్‌లో తమ వివరాలను నమోదు చేయాలని సూచించింది. ఖతార్‌లో ఎంత మంది భారతీయులు ఇరుక్కుపోయారో అంచనా వేయడానికి, వారికి అవసరమైన సాయం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఎంబసీ తెలిపింది.
హయ్య ఏ1 వీసా అనేది ఖతార్‌ను సందర్శించాలనుకునేవారికి అందించే ఒకే ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. దీన్ని ‘హయ్య’ వెబ్‌సైట్ లేదా ‘హయ్య టు ఖతార్’ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా పొందిన తర్వాత, గడువు ముగిసినా మరో 30 రోజులు పొడిగింపు అవకాశం ఉంటుంది.
ఇక, ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమవడంతో ఖతార్ నుంచి బయలుదేరాల్సిన అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో చాలామంది భారతీయులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల సహాయంతో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, చిక్కుకున్నవారిని సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది.