Iran Issues Big Warning: హోర్ముజ్ జలసంధి మూసేశామని ఇరాన్ భారీ హెచ్చరిక.. నౌకలు దాటితే కాల్చేస్తాం!

నౌకలు దాటితే కాల్చేస్తాం!

Update: 2026-03-03 07:14 GMT

Iran Issues Big Warning: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఇరాన్ ఇచ్చిన కొత్త వార్నింగ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుకుంది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశామని, ఆ మార్గంలో నౌకలు దాటడానికి ప్రయత్నించిన వెంటనే కాల్పులు జరుపుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విప్లవ గార్డులు, నౌకాదళ సిబ్బంది ఈ కార్యాచరణను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి వంటి హోర్ముజ్ జలసంధి కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నప్పటికీ, ఇక్కడి ద్వారా ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచ వాణిజ్యం గజగజలాడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీలు ప్రధానంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలకు చేరుతాయి. జలసంధి మూసుకుపోతే రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు భారీగా పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే చమురు ధరలు ఎగిరిపోతున్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ పూర్తిగా రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్‌పై ఇరాన్ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.

డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కెప్లర్’ గణాంకాల ప్రకారం, సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు హోర్ముజ్ దాటడానికి వేచి ఉన్నాయి. తూర్పు వైపు మరో 60 ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నాయి. గత ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంత భాగం మూసివేసినప్పుడు చమురు ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగిన విషయం గుర్తుంచుకోవాలి.

ప్రపంచం ఇప్పుడు ఇరాన్ తదుపరి చర్యల వైపు ఆందోళనతో చూస్తోంది. హోర్ముజ్ జలసంధి సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం త్వరిత చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News