Iran: ఇరాన్ ‘అట్రిషన్ వార్’ వ్యూహంతో ఇజ్రాయెల్-అమెరికా జేబులు ఖాళీ చేస్తోంది!

ఇజ్రాయెల్-అమెరికా జేబులు ఖాళీ చేస్తోంది!

Update: 2026-03-04 05:10 GMT

Iran: ఇజ్రాయెల్‌-అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ తన మిసైల్‌, డ్రోన్‌ దాడులను విస్తరిస్తోంది. ఇరాన్‌ ఇప్పుడు ‘అట్రిషన్‌ వార్‌’ (దీర్ఘకాలిక శక్తి క్షయం వ్యూహం) అనే కొత్త పద్ధతిని అవలంభిస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రువుకు భారీ ఆర్థిక నష్టం కలిగించి, వారి జేబులను ఖాళీ చేసి అలసిపోయేలా చేయడమే ఈ వ్యూహం లక్ష్యం.

ఇరాన్‌ చౌకైన షాహెద్‌-136 సూసైడ్‌ డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇవి ఒక్కో డ్రోన్‌ తయారీ ఖర్చు సుమారు 20 వేల డాలర్లు (సుమారు రూ.16 లక్షలు) మాత్రమే. ఇవి చిన్న క్రూయిజ్‌ మిసైళ్లలా పనిచేసి, లక్ష్యాన్ని చేరుకుని వెంటనే పేలిపోతాయి. గల్ఫ్‌ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి భారీ ఖర్చు చేస్తున్నాయి.

ఉదాహరణకు, ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థలో ఒక్క ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ధర రూ.35 నుంచి 45 లక్షల వరకు ఉంటుంది. అమెరికా పేట్రియాట్‌ మిసైల్‌ వ్యవస్థలో ఒక్క ఇంటర్‌సెప్టర్‌ ధర రూ.30 కోట్లకు పైగా ఉంటుంది. అంటే, రూ.16 లక్షల డ్రోన్‌ను కూల్చడానికి రూ.30 కోట్ల విలువైన క్షిపణిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ భారీ ఖర్చు వ్యత్యాసం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, ఖరీదైన మిసైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లో కొన్ని నిల్వలు తగ్గుతున్నట్లు అంతర్గత అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ఇరాన్‌ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు, మిసైళ్లు తయారుచేసి ప్రయోగిస్తుంటే, అమెరికా-ఇజ్రాయెల్‌లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారంగా మారుతోంది. దీర్ఘకాలంలో ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్‌ ఈ వ్యూహంతో శత్రువులను ఆర్థికంగా, మానసికంగా బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాడులు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Tags:    

Similar News