Iran–US Tensions: ఇరాన్-అమెరికా: చర్చల ఒడ్డున ఆంక్షల తుఫాను.. ట్రంప్ ద్వంద్వ విధానం
ట్రంప్ ద్వంద్వ విధానం
Iran–US Tensions: అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్‌లో జరుగుతున్న చర్చలు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు ఇరాన్ చమురు వ్యాపారంపై అగ్రరాజ్యం కఠిన ఆంక్షలు విధించడం ఆసక్తికరం. ఇరాన్‌తో ముడి చమురు వ్యాపారం చేస్తున్న 15 సంస్థలు, 14 రహస్య నౌకలపై అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షలు ప్రకటించింది. ఈ చమురు వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరాన్ విదేశాల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, తమ పౌరులను అణచివేయడానికి ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపించింది. అందుకే ఇరాన్ ఆదాయ మార్గాలను అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్ వ్యాపార నెట్‌వర్క్‌పై తమ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకుండా కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్‌లో అమెరికా ప్రతినిధులతో మొదలైన చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ 'చాలా సానుకూలమైన ప్రారంభం'గా పేర్కొన్నారు. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు మార్గం సుగమం చేయడంపైనే తాము ప్రాథమిక దృష్టి సారించామని వివరించారు.
ట్రంప్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి..
ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకునేలా అమెరికా ఒత్తిడి తీవ్రతరం చేస్తోంది. ఒప్పందం కుదరకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఇరాన్‌కు బాగా తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. టెహ్రాన్ ఒప్పందానికి ఆసక్తి చూపుతోందని చెప్పారు. తమ నౌకాదళం ఇరాన్ వైపు కదులుతున్నట్లు, అది చేరుకున్న తర్వాత ఎలా పనిచేస్తుందో చూడాలంటూ భిన్న సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని ట్రంప్ పునరుద్ఘాటించారు.