Strait of Hormuz: హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు జారుతోందా?
జారుతోందా?
80 శాతం నౌకలు ఒమన్ మార్గం ఎంచుకోవడంతో టెహ్రాన్ పట్టు కోల్పోయినట్లు
Strait of Hormuz: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఇరాన్, అమెరికా మధ్య వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. తాజా షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ కీలక జలమార్గంపై ఇరాన్ 80 శాతం పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.
గత రెండు వారాలుగా హర్మూజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే ఐరాస అధీకృత మార్గాన్ని ఎంచుకున్నట్లు కెప్లెర్ సంస్థ డేటా చెబుతోంది. ఇది అమెరికా సూచించిన రూట్. ఇరాన్ తన నియంత్రణలోని మార్గంలోనే నౌకలు ప్రయాణించాలని పట్టుబట్టి, ఒమన్ మార్గంలో వెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు చేస్తున్నప్పటికీ చాలా నౌకలు అమెరికా నౌకాదళం రక్షణతో ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి.
నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో నౌకల ట్రాఫిక్ దాదాపు లేదు. కానీ ఇటీవల రెండు వారాల నుంచి ఈ రూట్‌లో రాకపోకలు గణనీయంగా పెరిగాయి. “ఇరాన్ హర్మూజ్‌పై కనీసం పాక్షికంగా నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది” అని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ ఫలక్షాహి అభిప్రాయపడ్డారు.
కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను హర్మూజ్ మీదుగా పంపుతున్నాయి. ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నౌకలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ఇటీవల ప్రకటించినట్లు గత వారం రోజుకు సగటున 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. యుద్ధం ముందు నాటి 20 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “హర్మూజ్ ఇక మా భూభాగమే” అని ప్రకటించుకున్నారు.
ఇరాన్‌కు ఆర్థికంగా కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అమెరికాతో చర్చల్లో భాగంగా హర్మూజ్‌లో నౌకల నుంచి టోల్ వసూలు చేసే అవకాశం టెహ్రాన్‌కు లభించనుంది. కానీ గల్ఫ్ దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒమన్ మార్గం ఎంచుకోవడానికి ఈ టోల్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. హర్మూజ్‌పై పట్టు కోల్పోతే టెహ్రాన్‌కు ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది.
ఇరాన్ ఒమన్‌తో నౌకల రాకపోకల నిర్వహణపై ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. కానీ అమెరికా “హర్మూజ్ విషయంలో జోక్యం చేసుకుంటే ఒమన్‌పై బాంబులేస్తాం” అని బెదిరించడంతో ఈ ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ, అమెరికా నిఘా, రక్షణతో నౌకలు ఒమన్ మార్గంలోనే ప్రయాణిస్తుండటం హర్మూజ్‌పై టెహ్రాన్ ఆధిపత్యం తగ్గుతున్నట్లు సూచిస్తోంది.