Iran: ఇరాన్ అమెరికన్ పౌరులు, ఉద్యోగులపై దాడులు చేయడానికి అధునాత దశలో సన్నాహాలు చేస్తోందని అమెరికా గూఢచర్య వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యం అంతటా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో సిబ్బందిని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సౌదీ అరేబియా నుంచి దౌత్య అధికారులు, ఇతర ఫెడరల్ ఉద్యోగులను బయటకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.


జాతీయ గూఢచర్య డైరెక్టర్ జే క్లేటన్ శుక్రవారం విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు పంపిన మెమోలో ఈ విషయాలు స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను గణనీయంగా పెంచింది. మధ్యప్రాచ్యం, కొన్ని ఇతర దేశాల్లో అమెరికా పౌరులపై ప్రాణాంతక దాడుల ప్రణాళికలు అధునాత దశకు చేరుకున్నాయి’’ అని మెమోలో పేర్కొన్నారు.


ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికన్లపై ఉన్న ముప్పు ఇప్పుడు అత్యధిక స్థాయికి చేరుకుందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ మెమోను ధృవీకరించింది. యూఎస్‌లోనూ ఇరాన్ ఏజెంట్లు ఉండొచ్చని, యూరప్‌లో కూడా లక్ష్యాలు ఉన్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే ఇరాన్ సామర్థ్యం దాని ఉద్దేశాల కంటే తక్కువగా ఉండొచ్చని మరో అధికారి హెచ్చరించారు.


యెమెన్‌లోని హూతీలు సౌదీ అరేబియాపై దాడులు పెంచడంతో ఇప్పటికే సౌదీలోని అమెరికా ఎంబసీ సిబ్బందిని తగ్గించే చర్యలు చేపట్టారు. ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు సౌదీ విమానాశ్రయాలు, చమురు సౌకర్యాలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా దౌత్య కార్యాలయాల సిబ్బంది స్థాయిని సర్దుబాటు చేస్తున్నారు.


ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. ట్రంప్ ఇటీవల ‘‘మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ’’ చేయవచ్చని సూచించారు. ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Tags: