Isfahan: ఇస్ఫహాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భారీ దాడులు: ఇరాన్ అణు కేంద్రం దద్దరిల్లింది!
ఇరాన్ అణు కేంద్రం దద్దరిల్లింది!
Isfahan: పశ్చిమాసియా మరోసారి యుద్ధ భీతితో కంపరించిపోతోంది. ఇరాన్‌లోని ప్రధాన అణు సౌకర్యాలు ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా మంగళవారం రాత్రి భారీ దాడులు చేసింది. ఆకాశంలో భారీ అగ్నిగోళాలు కనిపించాయి. ఇస్ఫహాన్‌లోని ఆయుధ నిల్వలున్న ఒక డిపోపై 2వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో అగ్రరాజ్యం దాడి చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
ఈ దాడులకు ఇజ్రాయెల్ కూడా సహకరించినట్లు సమాచారం. ఇరాన్ కూడా తిరిగి దాడి చేసింది. పర్షియన్ గల్ఫ్‌లో కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు సహకరించని దేశాలు సొంతంగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్చరించారు. అయితే, యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఈ తాజా దాడి వీడియోను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
పశ్చిమాసియాలో శాంతి కోసం దాడుల్ని తక్షణం ఆపాలని చైనా, పాకిస్థాన్ డిమాండ్ చేశాయి. మరోవైపు అమెరికాకు కొన్ని దేశాలు షాక్ ఇస్తున్నాయి. ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల స్పెయిన్ కూడా అదే తరహాలో ప్రకటన చేసింది. ఇరాన్‌పై దాడుల్లో జోక్యం చేసుకోవడానికి ఈయూ దేశాలు ఇష్టపడడం లేదు. సిసిలీలోని తమ కీలక వైమానిక స్థావరాన్ని అమెరికా విమానాలు ఉపయోగించుకోవడానికి ఇటలీ అనుమతి నిరాకరించింది.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోయినా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం పేర్కొంది. హర్మూజ్‌ను బలవంతంగా తెరిపించాలని అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయం పడుతుందని అమెరికా అంచనా వేసింది. ఇప్పటికే 30 రోజులు ముగిసిన యుద్ధాన్ని మరింత పొడిగించకుండా ముగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నౌకాదళం, క్షిపణి నిల్వలను బలహీనపరచడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలు సాధించిన తర్వాత యుద్ధానికి పూర్తి విరామం ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం శాంతి చర్చల కోసం ఒత్తిడి చేస్తోంది.