Israel Issues Stern Warning to Mojtaba Khamenei: మొజ్తాబాపై ఇజ్రాయెల్ ఘాటు హెచ్చరిక – ఎక్కడున్నా అంతం చేస్తామని స్పష్టం

ఎక్కడున్నా అంతం చేస్తామని స్పష్టం

Update: 2026-03-18 07:43 GMT

ఐడీఎఫ్: మా దేశానికి ముప్పు అయిన వారెవరూ తప్పించుకోలేరు

Israel Issues Stern Warning to Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా మారిన వారెవరూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పష్టం చేసింది.

మీడియా సమావేశంలో ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ మాట్లాడుతూ ‘‘మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం మా వద్ద సమాచారం లేదు. కానీ మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపం. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు మా నుంచి తప్పించుకోలేరు. వారిని తరిమి తరిమి అంతం చేస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేము కానీ.. మా టార్గెట్ మాత్రం ఎప్పుడూ మిస్ కాదు’’ అని హెచ్చరించారు.

మరోవైపు, ఇటీవలి దాడుల్లో గాయపడిన మొజ్తాబా ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. రష్యాలో ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ‘‘ఇదొక కొత్తతరహా మానసిక యుద్ధం. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన లేదా షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు’’ అని స్పష్టం చేశారు.

ఇదే సందర్భంగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందిన విషయం తాజాగా ధృవీకరించబడింది. లారిజానీ మృతిని ఇరాన్ కూడా అధికారికంగా ధృవీకరించింది. దాడి జరిగినప్పుడు ఆయన తన కుమార్తె ఇంటి వద్ద ఉన్నారని, ఆ ఘటనలో ఆయన కుమారుడు, సహాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.

పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ హెచ్చరికలు చేయడం దృష్టి ఆకర్షించింది. మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఇరాన్ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ స్పందన ఇలా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News