Khaleda Zia Passes Away: ఖలీదా జియా కన్నుమూత: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి తుదిశ్వాస
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి తుదిశ్వాస
Khaleda Zia Passes Away: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్‌పర్సన్ ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫజ్ర్ ప్రార్థనల అనంతరం ఉదయం 6 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
నవంబర్ 23 నుంచి ఆస్పత్రిలో చేరిన ఖలీదా జియాకు గుండె జబ్బు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియా తదితర సమస్యలు ఉన్నాయి. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలతోపాటు ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆమె మరణించారు.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా పేరొందిన ఖలీదా జియా 1991-1996, 2001-2006 కాలంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. దేశంలో తొలిసారిగా కేర్‌టేకర్ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆమెదే. అవినీతి కేసుల్లో 2018 నుంచి 2020 వరకు జైలు శిక్ష అనుభవించారు.
1945లో భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో జన్మించిన ఖలీదా జియా 1960లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్‌ను వివాహమాడారు. 1981లో ఆయన హత్య అనంతరం బీఎన్‌పీ నాయకత్వం చేపట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ఇటీవల 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు.
ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక యుగం ముగిసింది. ఆమె అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.