Lavrov: లావ్రోవ్: రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ మాత్రమే చెప్పారు
భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ మాత్రమే చెప్పారు
Lavrov: అమెరికాతో వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపివేయనుందంటూ వచ్చిన వార్తల మధ్య, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తమ పార్లమెంటులో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును దిల్లీ నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవరూ చెప్పలేదని ఆయన అన్నారు. రష్యా పార్లమెంటు దిగువ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం లావ్రోవ్ ఈ విధంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఏ భారతీయ నాయకుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ వేదికగా ఈ ఏడాది నిర్వహించబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 'ఇంధన భద్రత' ఒక ప్రధాన అంశంగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చెప్పిన మాటలను లావ్రోవ్ గుర్తుచేశారు. ఆ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీలు సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. దిల్లీతో సంబంధాల విషయంలో మాస్కో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని, ఆకాశమే హద్దుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖార్కివ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి రష్యా బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 34 ఏళ్ల ఒక వ్యక్తి, అతని ముగ్గురు పిల్లలు మరణించారు. మృతుల్లో ఇద్దరు రెండేళ్ల వయసున్న కవలల బాలురు, మరొకరు ఏడాది వయసున్న బాలిక. దాడిలో ఆ పిల్లల తల్లి (35 వారాల గర్భవతి) తీవ్ర గాయాలపాలైంది.