Earthquake in Russia : రష్యాలో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 8.7గా తీవ్రత నమోదైనట్లు జపాన్‌ ప్రకటన;

Update: 2025-07-30 03:46 GMT

రష్యా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైనట్లు జపాన్‌ సునామీ హెచ్చరికల కేంద్రం ధృవీకరించింది. దీని ప్రభావం వల్ల రష్యా, జపాన్‌ దేశాల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వారు హెచ్చరికలు జారీ చేసినట్లుగానే రష్యా, జపాన్‌లను సునామీ అలలు తాకాయి. అయితే ఈ భారీ భూకంపం వల్ల కానీ, సునామీ వల్ల కానీ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. జపాన్‌లో ఉన్న నాలుగు దీవులకు ఉత్తరం వైపున్న హక్వైడో నుంచి సుమారు 250 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీ నగరంలో భవనాలు కంపిచాయి. భూకంప తీవ్రతకు భయకంపితులైన ప్రజలు ఇళ్ళ నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కామ్చాట్‌స్కీ ప్రాంతంలో విద్యత్‌కు అంతరాయం కలగగా, సెల్‌ ఫోన్‌ సేవలు స్తంభించిపోయాయి. 2011 తరువాత ఇంత పెద్ద తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే జపాన్‌ వాతావరణ శాఖ ఊహించినట్లుగానే రష్యాలోని కురిల్‌ దీవులతో పాటు, జపాన్‌ ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాల్లో సునామీ సంభవించింది. తీర ప్రాంతాల్లో అధికారలు సునామీ హెచ్చరిక సైరన్లు మోగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై నివాస ప్రాంతాల నుంచి వెలుపలకి వస్తున్నారు. సునామీ కారణంగా రష్యాలోని సెవెరోకురిల్స్క్‌ ఓడరేవు మునిగిపోయింది. ఈ ప్రాంతలో దాదాపు రెండు వేల మంది నివసిస్తున్నారు. వారందరినీ రష్యాన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎమర్జెన్సీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూకంపం కారణంగా ఏ క్షణమైనా సునామీ సంభవించచ్చని అందువల్ల నివాస ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని రష్యన్‌ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక జపాన్‌ దేశంలో అయితే తీర ప్రాంతంలో మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News