Major Setback for Donald Trump: అమెరికా మిత్రదేశాల నుంచి ట్రంప్‌కు గట్టి షాక్

ట్రంప్‌కు గట్టి షాక్

Update: 2026-03-17 06:39 GMT

హర్మూజ్ జలసంధి: మీతో కలిసి రాలేం!

హర్మూజ్‌లో యుద్ధ నౌకలు పంపేందుకు నిరాకరణ

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం... చమురు రవాణా స్తంభనం


Major Setback for Donald Trump: అమెరికా-ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుండటంతో పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు ఈ హర్మూజ్ జలసంధి గుండా సాగుతుంది. ఇరాన్ పట్టుతో ఈ మార్గం దాదాపు మూసివేయబడిన నేపథ్యంలో ఇంధన సంక్షోభం, ఆర్థిక సంక్షోభం భయాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.

ఈ సంక్షోభాన్ని అధిగమించి హర్మూజ్‌ను తిరిగి తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలను సహకరించాలని బలంగా కోరారు. యుద్ధ నౌకలను పంపి చమురు ట్యాంకర్లను రక్షించాలని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలను ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే ఈ పిలుపుకు మిత్రదేశాలు గట్టిగా నిరాకరణ తెలిపాయి. ఇది ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

నాటోకు సంబంధం లేదంటూ ఐరోపా దేశాలు

జర్మనీ స్పష్టంగా తమ దేశం ఈ యుద్ధంలో భాగస్వామ్యం వహించదని ప్రకటించింది. "ఈ యుద్ధం నాటోకు సంబంధించినది కాదు" అని జర్మన్ అధికారులు తెగేసిచెప్పారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలు కూడా యుద్ధ నౌకలు పంపేందుకు నిరాకరించాయి. డిప్లొమసీ ద్వారానే సమస్య పరిష్కరించాలని వీరు పేర్కొన్నారు. జపాన్, ఆస్ట్రేలియా వంటి ఆసియా-పసిఫిక్ మిత్రదేశాలు కూడా ఇదే వైఖరి అవలంబించాయి.

చైనా కూడా ససేమిరా

ట్రంప్ చైనాను కూడా ఈ కోలిషన్‌లో చేరాలని ప్రత్యేకంగా కోరారు. అయితే చైనా వెంటనే సైనిక చర్యలు ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చింది. హర్మూజ్‌ను తెరిచేందుకు యుద్ధ నౌకలు పంపే విషయంలో చైనా సహకరించదని సూచనలు వచ్చాయి.

ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి

మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఊపందుకుంటున్నాయి. టెహ్రాన్, బీరుత్‌లపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇరాన్ డ్రోన్ దాడులతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది. విమానాశ్రయాన్ని తెరిచిన కొద్దిగంటలకే మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం. అయితే మిత్రదేశాల నుంచి సహకారం రాకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో నాటో భవిష్యత్తుపై కూడా ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ఐరోపా దేశాలు డిప్లొమసీ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి.

Tags:    

Similar News