US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ.. సుంకాలు రద్దు

సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ.. సుంకాలు రద్దు

Update: 2026-02-21 03:21 GMT

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై విధించిన భారీ సుంకాలు చెల్లవని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. శుక్రవారం వెలువడిన ఈ తీర్పుతో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6:3 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా చట్టసభల (కాంగ్రెస్‌) అనుమతి లేకుండా విధించిన ఈ సుంకాలను రద్దు చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడి అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేసి ప్రతీకార సుంకాలు విధించడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగం ప్రకారం పన్నులు, సుంకాల విధానాల అధికారం చట్టసభలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని మెజారిటీ తీర్పులో, 'రాజ్యాంగ నిర్మాతలు పన్నులు, సుంకాలు విధించే అధికారాన్ని కార్యనిర్వాహక శాఖకు అప్పగించలేదు' అని పేర్కొన్నారు. అయితే, ముగ్గురు న్యాయమూర్తులు ఈ మెజారిటీ తీర్పుకు విరుద్ధంగా అసమ్మతి వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నిర్ణయాలు చట్టబద్ధమేనని, గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారని వారు తెలిపారు. భారత్‌పై విధించిన అదనపు సుంకాలు, ప్రతీకార సుంకాలను తగ్గించిన విషయాన్ని జస్టిస్‌ బ్రెట్‌ కవనాఫ్‌ తన అసమ్మతి తీర్పులో ప్రస్తావించారు.

కోర్టు తీర్పుపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. విదేశీ ప్రభావాలకు ధర్మాసనం గురైందని ఆక్షేపించారు. మరింత రెచ్చిపోతూ అదనంగా 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌తో కుదిరిన ఒప్పందానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అన్నారు.

వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లించాలా?

ట్రంప్‌ ఆదేశాలతో దిగుమతిదారుల నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి చెల్లించాలా లేదా అనేది సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో గందరగోళం నెలకొంది. అనేక కంపెనీలు అదనపు సుంకాలను తిరిగి చెల్లించాలంటూ దిగువ కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. గత ఏడాది డిసెంబరు వరకు ఈ సుంకాల ద్వారా 13,300 కోట్ల డాలర్లు అమెరికా ఖజానాకు చేరినట్లు అంచనా. ఈ మొత్తాల తిరిగి చెల్లింపు వల్ల ట్రంప్‌ ప్రభుత్వ ఆదాయ అంచనాలు తలకిందులవుతాయని అసమ్మతి తీర్పు రాసిన జస్టిస్‌ కవనాఫ్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే పదేళ్లలో ఈ సుంకాల వసూళ్లు 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటాయని అంచనాలు ఉన్నాయి. అమెరికాలోని దిగుమతి కంపెనీల సంఘాలు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి.

వాణిజ్య ఒప్పందాలు నిరర్థకమవుతాయా?

సుప్రీంకోర్టు తీర్పు వల్ల బ్రిటన్, జపాన్, యూరోపియన్‌ యూనియన్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, భారత్‌ తదితర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు నిరర్థకంగా మారే అవకాశం ఉంది. ఆ దేశాలు ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చు. ట్రంప్‌ ఇలాంటి సుంకాలను 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' (ఐఈఈపీఏ) సెక్షన్‌ 301, 232 కింద విధించేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, అందుకు చట్టసభల మోదం అవసరం. దీంతో జాప్యం జరిగి మరిన్ని న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతాయి. ఈ తీర్పు వాణిజ్య విషయాల్లో చట్టసభల పాత్రను బలోపేతం చేస్తుంది. సుంకాలను ఆయుధాలుగా వాడి అధ్యక్షుడు ఇష్టానుసారం వ్యవహరించడానికి కళ్లెం వేస్తుంది.

అత్యవసర అధికారాల దుర్వినియోగం నేపథ్యం

2025 ఏప్రిల్‌ 2న అమెరికా వాణిజ్య లోటు పెరిగిపోవడాన్ని జాతీయ అత్యవసరంగా ప్రకటించిన ట్రంప్‌, అన్ని దిగుమతులపై 10 శాతం సుంకం విధించారు. ఇదే ఈ వివాదానికి మూలం. తర్వాత వాటిని మరింత పెంచి ప్రపంచ దేశాలపై భారీ భారం మోపారు. ఈ తీర్పు ఆ దిశలో మార్పు తెచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News