Mass Protests in PoK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత 22 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలోని రావల్‌కోట్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమంలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ (జేఏఏసీ) నేతలు ఈ సందర్భంగా ప్రసంగించారు.

‘పీవోకే అసలు పాకిస్థాన్‌లో భాగం కాదు. మాకు పాకిస్థాన్ అవసరమే లేదు. వారికి మా (పీవోకే) అవసరం ఉంది’ అని స్పష్టంగా హెచ్చరించారు. పాక్ ప్రభుత్వం ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ‘ఇతర మార్గాలు’ (భారత్‌తో సన్నిహిత సంబంధాలు) వెతికేందుకు సిద్ధమవుతామని జేఏఏసీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. నియంతృత్వ వైఖరి కొనసాగిస్తే సహించేది లేదని, తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించారు. నేతల ప్రసంగాలకు స్థానికుల నుంచి భారీ మద్దతు లభించింది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పీవోకేలో ఆకలి కేకలు.. పాక్ నిరంకుశత్వం

పీవోకేలో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆందోళనలు చేస్తున్న స్థానికులను అణచివేసేందుకు పాక్ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇటీవల నిత్యావసరాలతో వస్తున్న ట్రక్కులను పీవోకేలోకి అడ్డుకున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమపిండి, బియ్యం, చక్కెర వంటి అత్యావశ్యక వస్తువుల కొరత తీవ్రంగా ఏర్పడింది.

ఆందోళనల వివరాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. ఆకలితో అలమటిస్తున్న ప్రజల ఆగ్రహం మరింత పెరిగిపోతోంది. పాక్ ప్రభుత్వం ఆంక్షలు సడలించకపోవడం వల్ల స్థానికుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ ఆందోళనలు పాకిస్థాన్‌లోని రాజకీయ అస్థిరతను మరింత బయటపెడుతున్నాయి. పీవోకే ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం దీనిని గమనించాల్సిన అవసరం ఉంది. పాక్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి.

Tags: