Massacre in Nigeria: నైజీరియాలో ఘోర ఊచకోత.. దాదాపు 200 మంది మృతి
దాదాపు 200 మంది మృతి
Massacre in Nigeria: నైజీరియాలో సాయుధ దుండగులు భయంకర నరమేధం సృష్టించారు. రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 200 మందిని అతి క్రూరంగా హత్య చేశారు. ఇళ్లు, దుకాణాలను తగలబెట్టి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నైజీరియా భద్రతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.
క్వారా రాష్ట్రంలోని వోరో, నూక (లేదా నుకు) అనే రెండు గ్రామాలపై మంగళవారం సాయంత్రం ఈ దాడులు జరిగాయి. స్థానిక శాసనసభ్యుడు సైదు బాబా అహ్మద్ మాట్లాడుతూ.. దుండగులు ప్రజలను చుట్టుముట్టి, చేతులు వెనక్కి కట్టి కాల్చి చంపేశారని వెల్లడించారు. కొందరు ప్రాణభయంతో పరుగెత్తి అడవుల్లోకి పారిపోయారని, వారి ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. స్థానిక మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న లకురావా (Lakurawa) గ్రూప్ పాల్పడినట్లు సమాచారం. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులకు హెచ్చరికలు పంపుతున్నా, ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఇటీవల నైజీరియా సైన్యం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులపై ఆపరేషన్లు నిర్వహించి 150 మందిని మట్టుబెట్టింది. దీనికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగాయని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. దీన్ని 'పిరికిపంద చర్య'గా అభివర్ణించారు.
అదే సమయంలో ఉత్తర నైజీరియాలోని కాట్సినా రాష్ట్రంలోని డోమా గ్రామంపై కూడా దుండగులు దాడి చేశారు. ఇంటింటా వెళ్లి కాల్చి 21 మందిని చంపేశారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మృతుల సంఖ్య దాదాపు 200కు చేరింది.
అధ్యక్షుడు బోలా టినుబు ఆదేశాల మేరకు క్వారా రాష్ట్రంలో సైన్యాన్ని మోహరించారు. దాడికారులను వెతుకుతూ, బయటపడిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. నైజీరియాలో బోకోహారం, ఐసిస్‌తో సంబంధం ఉన్న సమూహాలు, ఇతర దుండగుల బారిన పడి భద్రతా సమస్యలు తీవ్రమవుతున్నాయి.