Mike Huckabee: ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీ సిబ్బందికి రాయబారి ఆదేశం: వెంటనే ఖాళీ చేయండి
వెంటనే ఖాళీ చేయండి
Mike Huckabee: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడి అమెరికా రాయబారి మైక్ హకబీ ఎంబసీ అధికారులు, సిబ్బందిని వెంటనే ఇజ్రాయెల్‌ను వీడి స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు.
ఈ ఆదేశాల ప్రకారం, సిబ్బంది స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అయ్యే ఖర్చులను అమెరికా ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని రాయబారి స్పష్టం చేశారు. ప్రస్తుతం తక్షణ భయాందోళనలు లేవని, అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇజ్రాయెల్‌ను వీడితే మంచిదని ఆయన సూచించారు. వాణిజ్య విమానాలు అందుబాటులో ఉన్నంత వరకు వెంటనే బయలుదేరాలని సూచనలు జారీ చేశారు.
ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అణు చర్చల్లో ప్రతిష్టంభనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీకి ఈ తాజా ఆదేశాలు రావడం గమనార్హం. దీంతో అమెరికా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోందా అని పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, అమెరికా తమపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తామని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ సైతం అప్రమత్త స్థితిలో ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాంతంలో యుద్ధ భయాందోళనలు మరింత పెరిగాయి. అమెరికా భారీ సైనిక శక్తిని ప్రాంతంలోకి తరలిస్తోంది.