Mojtaba Khamenei: ఇరాన్ ఐక్యతను తక్కువగా అంచనావేశారు: మొజ్తాబా – అమెరికా, ఇజ్రాయెల్‌పై విమర్శలు

అమెరికా, ఇజ్రాయెల్‌పై విమర్శలు

Update: 2026-03-21 07:11 GMT

Mojtaba Khamenei: అమెరికా, ఇజ్రాయెల్‌తో భీకర యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ అగ్రనేత మొజ్తాబా ఖమేనీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యర్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పర్షియన్‌ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ లేఖను ఇరాన్‌ టీవీలో చదివి వినిపించారు.

మూడువారాల పోరాటంలో ఇరాన్‌ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని మొజ్తాబా ఖమేనీ కొనియాడారు. అగ్రనేతలను చంపేస్తే ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయవచ్చన్న భ్రమతో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ యుద్ధానికి దిగాయని ఆయన విమర్శించారు. ‘‘పోరు ఆరంభమైన రెండు రోజుల్లోనే ఇరాన్‌ ప్రజలు ప్రభుత్వాన్ని పడగొడతారని ప్రత్యర్థులు లెక్కలు కట్టారు. అయితే జాతి ఐక్యతను వారు తక్కువగా అంచనావేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.

శత్రువులను ఎదుర్కొనేందుకు ఇరాన్‌వాసులు దేశవ్యాప్తంగా గట్టి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యర్థులను గట్టిగా దెబ్బతీస్తున్నారని ఖమేనీ ప్రశంసించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో శత్రు పక్షాలు అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

పొరుగు దేశాలతో సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. దాడుల్లో మరణించిన తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీకి పాకిస్థాన్‌ అందించిన సహకారాన్ని కొనియాడారు. ఇరాన్‌ జాతి ఐక్యత, దృఢ నిర్ణయంతో శత్రువులను ఓడిస్తుందని మొజ్తాబా ఖమేనీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News