US Revelations Expose Pakistan Army Chief: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అమెరికా సాయం కోసం తీవ్రంగా లాబీయింగ్ చేసిన విషయాలు యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలైన ఫైలింగ్స్‌లో బయటపడ్డాయి. ఇవి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన ప్రకటనలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిమ్ మునీర్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ప్రయత్నాలు చేసిందని, ప్రాంతీయ శాంతి కోసం పాకిస్తాన్ ఆ అభ్యర్థనలను అంగీకరించిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనలు అంతా డొల్లు అని తాజా అమెరికా డాక్యుమెంట్లు వెల్లడి చేశాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ వాషింగ్టన్‌లోని కీలక నేతలు, అధికారులతో తీవ్రంగా చర్చలు జరిపింది. మే 6 అర్ధరాత్రి భారత్ దాడుల ధాటికి కంగారు పడిన పాక్ 30 సార్లకు పైగా వివిధ సంప్రదింపులు చేపట్టింది. పాక్ అంబాసిడర్‌కు అమెరికా నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది.

మే 7, 8 తేదీల్లో తమ ప్రాంతంలో ఉద్రిక్తతలపై చర్చించడానికి లాబీయింగ్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మే 9న లాబీయింగ్ మరింత పెంచి, రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలతో ముడిపడిన వ్యక్తులతో 20 నుంచి 25 సార్లు సంప్రదింపులు జరిపింది. అమెరికా మీడియాలోని ప్రముఖ జర్నలిస్టులతో కూడా పాక్ లాబీ సంస్థలు భేటీ అయ్యాయి. రక్షణ, ఆర్థికశాఖ అధికారులు, జర్నలిస్టులతో మొత్తం 60 సార్లకు పైగా సమావేశాలు జరిగినట్లు ఫైలింగ్స్‌లో వెల్లడైంది.

అమెరికాలో భారత్, పాకిస్తాన్ కార్యకలాపాల మధ్య స్పష్టమైన తేడా కనిపించిందని ఈ ఫైలింగ్స్ సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గాం దాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వంటి అంశాలపై భారత్ సంప్రదింపులు జరిపింది. మరోవైపు పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో మూడో పక్షం జోక్యాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బతో కంగుతిన్న పాక్ చివరకు కాల్పుల విరమణకు అంగీకరించింది.

ఈ అమెరికా బహిర్గతాలు అసిమ్ మునీర్ ప్రకటనలను పూర్తిగా బలహీనపరిచాయి.

Tags: