Prime Minister Balen Shah: భారత భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించింది: ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు

ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు

Update: 2026-06-01 12:33 GMT

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు.. విదేశాంగ శాఖ స్పందన

Prime Minister Balen Shah: నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర వివాదానికి దారితీశాయి. భారత్‌-నేపాల్ సరిహద్దు వివాదం పై చర్చ సందర్భంగా బాలేంద్ర షా "భారత భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించింది" అని ప్రకటించడం పెద్ద సంచలనం సృష్టించింది.

ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటి సారి పార్లమెంటు సమావేశాలకు హాజరైన బాలేంద్ర షాకు విపక్షాలు లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ సరిహద్దు వివాదాలపై ప్రశ్నలు సంధించాయి. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "భారత్ నేపాల్ భూభాగాలను ఆక్రమించడమే కాదు, నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించింది" అని అన్నారు. ఈ విషయం తనకు ప్రధాని అయ్యాకే తెలిసిందని కూడా చెప్పారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులను ఇరు దేశాలు సంప్రదించాలని అంగీకరించాయని బాలేంద్ర షా తెలిపారు. ఈ అంశాన్ని చైనా, బ్రిటన్ దృష్టికి తీసుకెళ్లామని కూడా పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ఆగ్రహం:

బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

విదేశాంగ శాఖ స్పందన:

ఈ వివాదం పెరగడంతో నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. "ప్రధాని వ్యాఖ్యలు సరిహద్దును దాటి ఉన్న నివాస ప్రాంతాలు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లోని ఆక్రమణల గురించే. ప్రాదేశిక హక్కులు, సార్వభౌమత్వం అంశాలతో దీనికి సంబంధం లేదు" అని స్పష్టం చేసింది.

Tags:    

Similar News