Airstrikes on Afghan Cities: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య బహిరంగ యుద్ధం: అఫ్గాన్ నగరాలపై వైమానిక దాడులు

అఫ్గాన్ నగరాలపై వైమానిక దాడులు

Update: 2026-02-27 04:13 GMT

Airstrikes on Afghan Cities: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 'ఎక్స్' ప్లాట్‌ఫాం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'మా సహనానికి మేరకు చేరుకుంది. ఇక మా మధ్య బహిరంగ యుద్ధమే' అంటూ అఫ్గానిస్థాన్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు.

గురువారం రాత్రి అఫ్గాన్ దాడులకు ప్రతిగా పాకిస్థాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్‌కు 'గజబ్ లిల్ హక్' అని పేరు పెట్టారు. తాలిబన్ బలగాలపై పాక్ సైన్యం బలంగా ప్రతిఘటిస్తుందని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. కాబుల్‌లో మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని తాలిబన్ అధికారులు తెలిపారు. కాబుల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా వెల్లడించారు. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని చెప్పారు.

అఫ్గాన్ చేపట్టిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని అఫ్గాన్ ప్రకటించింది. కానీ, పాకిస్థాన్ దీన్ని ఖండించింది. ఘర్షణల్లో తమ వైపు ఇద్దరు సైనికులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. అఫ్గాన్ సైనికులను నిర్బంధించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ వెల్లడించారు. అఫ్గాన్ వైపు 133 మంది సైనికులు మరణించారని, 200 మందికి పైగా గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. తొమ్మిది మంది అఫ్గాన్ సైనికులను తమ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల పాక్ వైమానిక దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్ ఈ దాడులు చేపట్టింది. ఇది ఇరు దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలకు కారణమవుతోంది.

Tags:    

Similar News