Pakistan PM Sharif Showers Praise on Trump: పాక్‌ ప్రధాని షరీఫ్‌ నుంచి ట్రంప్‌కు ప్రశంసల వర్షం.. శాంతి సదస్సులో ఆసక్తికర ఘటన

శాంతి సదస్సులో ఆసక్తికర ఘటన

Update: 2026-02-20 06:33 GMT

Pakistan PM Sharif Showers Praise on Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రశంసలు కురిపించారు. గాజా శాంతి సదస్సు సందర్భంగా జరిగిన ఈ ఘటన, దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. భారత్‌-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం పాకిస్థాన్‌ను కలవరపరుస్తున్న నేపథ్యంలో, అమెరికాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

గాజా ప్రాంతాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో వాషింగ్టన్‌లో నిర్వహించిన శాంతి సమావేశంలో పలు దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ, గతేడాది భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సమయంలో తాను జోక్యం చేసుకున్నానని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపకపోతే 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించానని, తన చర్యల వల్లే రెండు అణు శక్తి దేశాల మధ్య సంఘర్షం నివారించబడిందని చెప్పారు. అంతేకాకుండా, ఆ సంఘర్షంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని వెల్లడించారు, అయితే అవి ఏ దేశానికి చెందినవో వివరించలేదు.

ట్రంప్‌ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. మోదీ గొప్ప నాయకుడని, గాజా శాంతి ప్రణాళికపై తాను మోదీతో చర్చించానని, ఆయన ఆసక్తి చూపారని తెలిపారు. అయితే, ట్రంప్‌ చేసిన ఈ ప్రకటనలను భారత్‌ గతంలోనూ తిరస్కరించిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ను శాంతి దూతగా అభివర్ణించిన షరీఫ్‌

సమావేశంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ప్రసంగించారు. ట్రంప్‌ను ‘శాంతి కాముకుడు’గా, ‘దక్షిణాసియా రక్షకుడు’గా కీర్తించారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలను సమయోచిత నిర్ణయాలతో ట్రంప్‌ నివారించారని, దీంతో కోట్లాది ప్రాణాలు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. పలు దేశాల్లో శాంతిని నెలకొల్పడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారని షరీఫ్‌ అన్నారు.

అయితే, ఈ ప్రశంసలు చేసినప్పటికీ, సమావేశంలో షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్‌ ఫొటో సమయంలో ప్రపంచ నేతలు ముందు వరుసలో నిలబడగా, షరీఫ్‌ వెనుక వరుసకు పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఆందోళన కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. తర్వాత ట్రంప్‌ షరీఫ్‌ను ప్రశంసించడం గమనార్హం.

ఈ శాంతి సదస్సుకు భారత్‌ ‘అబ్జర్వర్‌’ దేశంగా హాజరైంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి మన దేశం తరఫున పాల్గొన్నారు. ఈ ఘటనలు పాకిస్థాన్‌ అమెరికాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలనే ఆరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Tags:    

Similar News